
Congress Slams BJP: భాజపా ముఖ్యమంత్రులను అందుకే మారుస్తోంది..!
పలు రాష్ట్రాల్లో సీఎంల మార్పుపై కాంగ్రెస్ విమర్శలు
దిల్లీ: గుజరాత్‌తో పాటు భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చడం పట్ల కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే వారి ముఖ్యమంత్రులను బలిపశువులను చేస్తున్నట్లు ఆరోపించింది. గుజరాత్ సీఎంగా విజయ్ రూపానిని తప్పించి నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ను ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా స్పందించింది.
‘భాజపా అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌లో సీఎం త్రివేంద్ర సింగ్, తీరత్ సింగ్ నుంచి ఇప్పుడున్న పుష్కర్ సింగ్ ధమీ వరకూ ఇలాగే ఉంది. కర్ణాటకలో యడియూరప్ప నుంచి బొమ్మై, అస్సాంలో సోనోవాల్ నుంచి హిమంత బిశ్వ శర్మ, తాజాగా గుజరాత్లో రూపాణీ నుంచి భూపేంద్ర పటేల్ వరకు సీఎంల మార్పు కొనసాగుతోంది. వీరందరినీ ఎందుకు తొలగిస్తున్నారు?’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ప్రశ్నించారు. ఎందుకంటే, ఆయా రాష్ట్రాల్లో భాజపా పనితీరు బాగాలేదని చెప్పకనే చెబుతున్నారని విమర్శించారు. కొవిడ్ విజృంభణ విషయంలోనూ అదే పనితీరు కనిపిస్తోందని.. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ధోరణే కారణమని అన్నారు. కొవిడ్ టీకాల సేకరణలోనూ కేంద్ర ప్రభుత్వం ఇదే నిర్లక్ష్యం చూపెడుతోందని గౌరవ్ వల్లభ్ దుయ్యబట్టారు.
ఇక భాజపా పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చడంపై మరో కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ విమర్శలు గుప్పించారు. కేవలం ఆయా రాష్ట్రాల్లో ప్రజలను తప్పుదోవపట్టించేందుకే రాష్ట్రాల ముఖ్యమంత్రులను మారుస్తున్నారని విమర్శించారు. తమ తప్పిదాలను ముఖ్యమంత్రులపై నెట్టేసి.. వారిని తొలగిస్తోందని అన్నారు. వారి స్థానంలో కొత్త సీఎంలను నియమించి రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తోందని రషీద్ అల్వీ దుయ్యబట్టారు.