Amarinder Singh: అమిత్‌ షాతో కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ భేటీ.. భాజపాలో చేరేందుకేనా..?

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు.

Updated : 29 Sep 2021 20:18 IST

దిల్లీ: మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా చేసిన అనంతరం అమరీందర్‌ సింగ్‌ దిల్లీ చేరుకోవడంతో ఆయన భాజపాలో చేరుతున్నారనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పంజాబ్‌లో ఓవైపు కాంగ్రెస్‌ పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ.. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ దిల్లీ పయనమయ్యారు. దీంతో ఆయన భాజపాలో చేరతారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ వ్యక్తిగతంగానే దిల్లీకి వెళ్లినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అయితే, ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తనకు కాంగ్రెస్‌ పార్టీ కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరించిందని తన సన్నిహితుల వద్ద అమరీందర్‌ సింగ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన భాజపాలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమరీందర్‌ సింగ్‌ భాజపాలో చేరితే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని ఆయనకు వ్యవసాయశాఖను అప్పగించాలని కమలనాథులు భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆయనను భాజపా సీనియర్‌ నేతలు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హోంమంత్రి అమిత్‌ షా నివాసంలో అమరీందర్‌ సింగ్‌ సమావేశమయ్యారు. అనంతరం భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ కెప్టెన్‌ అమరీందర్‌ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజీనామా తర్వాత పంజాబ్‌లో రాజకీయ సమీకరణాలు వెనువెంటనే మారుతున్నాయి. అమరీందర్ స్థానంలో సీఎంగా చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేబినెట్‌ విస్తరణ జరిగిన కొన్ని గంటలకే కాంగ్రెస్‌ చీఫ్‌ సిద్ధూ కూడా పీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనకు సంఘీభావంగా ఓ మంత్రితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మద్దతు నిలిచారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూను రంగంలోకి దించాలని కాంగ్రెస్‌ భావిస్తుండడాన్ని కెప్టెన్‌ అమరీందర్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా సిద్ధూ ఓ అస్థిరమైన, ప్రమాదకరమైన వ్యక్తి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్‌తో సుదీర్ఘ సరిహద్దు కలిగిన పంజాబ్‌ చాలా సున్నితమైన, సమస్యాత్మకమైన రాష్ట్రమని.. అటువంటప్పుడు సిద్ధూ వంటి నేతలతో దేశ భద్రతకు ముప్పేనని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని