Punjab Politics: సిద్ధూ గురించి ముందే చెప్పా : కెప్టెన్‌ అమరీందర్‌

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్‌ సింగ్ సిద్ధూ రాజీనామాపై మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్పందించారు. సిద్ధూకి స్థిరత్వం లేదని ముందే చెప్పినట్లు పేర్కొన్నారు.

Published : 29 Sep 2021 02:03 IST

సిద్ధూ దళిత వ్యతిరేకి అని విమర్శించిన ఆమ్‌ఆద్మీ పార్టీ

దిల్లీ: పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్‌ సింగ్ సిద్ధూ రాజీనామాపై మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్పందించారు. సిద్ధూకి స్థిరత్వం లేదని ముందే తాను చెప్పానని పేర్కొన్నారు. పంజాబ్‌ వంటి సరిహద్దు రాష్ట్రానికి సిద్ధూ సరిపోరని కెప్టెన్‌ అమరీందర్ సింగ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. సిద్ధూకు పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు అప్పజెప్పిన నాటి నుంచే అమరీందర్‌ సింగ్‌ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దేశానికి, పంజాబ్‌కు సిద్ధూ ప్రమాదకరమంటూ అమరీందర్‌ సింగ్‌ ఈ మధ్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా పీసీసీ పదవికి నుంచి సిద్ధూ తప్పుకోవడంతో .. ఆయన గురించి ముందే చెప్పాను కదా అంటూ కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

సీఎంగా దళితుడిని జీర్ణించుకోలేకనే..

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా దళిత వ్యక్తి బాధ్యతలు చేపట్టడాన్ని జీర్ణించుకోలేకనే పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ రాజీనామా చేసినట్లు ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపించింది. సిద్ధూ దళితులకు వ్యతిరేకమని తాజా ఘటన స్పష్టం చేస్తోందని విమర్శించింది. ఓ పేద వ్యక్తి ముఖ్యమంత్రిగా అవడాన్ని సిద్ధూ భరించలేకపోవడం విచారకరమని ఆమ్‌ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరబ్‌ భరద్వాజ్‌ పేర్కొన్నారు.

సిద్ధూకు సంఘీభావంగా మంత్రి రాజీనామా..

పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికీ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయనకు సంఘీభావంగా ఓ మంత్రి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నట్లు రజియా సుల్తానా ప్రకటించారు. మంత్రివర్గం నుంచి తప్పుకున్నప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని రజియా సుల్తానా పేర్కొన్నారు. తనకు అవకాశం ఇచ్చిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆమె చెప్పారు.

కెప్టెన్‌ భాజపాలో చేరితే.. మంత్రివర్గంలో చోటు?

పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలోనే కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తాజాగా దిల్లీ పయనమయ్యారు. దీంతో ఆయన భాజపాలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత పనులమీదే దిల్లీకి వెళ్లినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తనకు కాంగ్రెస్‌ పార్టీ కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరించిందని తన సన్నిహితుల వద్ద అమరీందర్‌ సింగ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన భాజపాలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమరీందర్‌ సింగ్‌ భాజపాలో చేరితే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని ఆయనకు వ్యవసాయశాఖను అప్పగించాలని కమలనాథులు భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆయనను భాజపా సీనియర్‌ నేతలు పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, అమరీందర్‌ సింగ్‌ భవిష్యత్‌ కార్యాచరణపై మరికొన్ని గంటల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని