
Ts News: సీఎం కేసీఆర్ ఆ ఆలోచన విరమించుకోవాలి.. లేదా ఉద్యమం తప్పదు: చాడ వెంకట్‌రెడ్డి
హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామనే ప్రతిపాదనను సీఎం కేసీఆర్ విరమించుకోవాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. కార్మికులను ఉద్దేశించి నాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల్లోకి రాకపోతే ప్రైవేటీకరిస్తామని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రైవేట్‌పరం చేయడానికి అడుగులు వేస్తున్నారని ఆక్షేపించారు. కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో నడుస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొని లాభాలతో నడిపిస్తున్నారని.. తెలంగాణలో విలీనం చేయకుండా ప్రైవేటీకరిస్తామని చెప్పడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకరావడానికి అనేక మార్గాలున్నాయన్నారు. డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తే కొంతమేర ఉపశమనం కలుగుతుందని సూచించారు. ప్రజారవాణా వ్యవస్థను మెరుగు పరిచి, ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చాడ అన్నారు.