Chandrababu: జగన్‌ చేసిన తప్పులను చరిత్ర మరిచిపోదు: చంద్రబాబు

వైకాపా పాలనలో రాష్ట్రం మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు...

Updated : 05 Jan 2022 16:12 IST

అమరావతి: వైకాపా పాలనలో రాష్ట్రం మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంలో సీఎం జగన్‌ చేసిన తప్పులను చరిత్ర మరిచిపోదన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో 175 శాసనసభ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ పాలనపై విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన కంటే జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా దెబ్బతిందని.. ఏమాత్రం అభివృద్ధి లేదని విమర్శించారు.

తెదేపాతోనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు చెప్పారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని.. ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండగ జరుపుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. పన్నులపై పన్నులు వేసి భారం మోపుతున్నారని ఆక్షేపించారు. ఆఖరికి చెత్తపైనా పన్ను వేసే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు. రాష్ట్రం బాగుపడాలంటే వైకాపా గ్రహణం వీడాలన్నారు.

తెదేపాకు ఈ ఏడాది ఎంతో కీలకమని.. ఏం చేసినా ఈ ఏడాదే చేయాలని చంద్రబాబు అన్నారు. స్థానిక నేతల దోపిడీని స్థానిక నేతలే ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. మనం చేసేది రాజకీయ యుద్ధమే తప్ప.. భౌతిక యుద్ధం కాదని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో జరిగే తప్పిదాలపై పోరాడకుంటే లాభముండదన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని