
Ap News: వంగవీటి రాధాకు తెదేపా అండగా ఉంటుంది: చంద్రబాబు
విజయవాడ: తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై రెక్కీ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ..డీజీపీకి లేఖ రాశారు. శనివారం సాయంత్రం విజయవాడలోని వంగవీటి రాధా నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. రెక్కీ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాధాకు తెదేపా పూర్తిగా అండగా ఉంటుందన్నారు. కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాధాపై హత్యాయత్నానికి సంబంధించి ఆధారాలున్నా చర్యల్లేవన్నారు. ‘‘హత్యకు రెక్కీ చేసిన మాట వాస్తవమా?కాదా?. రెక్కీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయా? లేదా?. దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకు కాలయాపన చేస్తున్నారు. దోషులను కాపాడేలా ప్రభుత్వం వైఖరి ఉంది. తప్పుడు పనులు చేసేవారిని ఎప్పటికప్పుడు శిక్షించాలి. ఎవరు రెక్కీ చేశారో తెలిసి కూడా వారిని పట్టుకోకుండా, చర్యలు తీసుకోకుండా.. రక్షణ కల్పిస్తామని చెబుతున్నారు. భద్రత కల్పిస్తున్నామని చెప్పి.. అసలు దోషులను తప్పిస్తారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
తనను చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహించారని ఇటీవల వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా స్పందించారు. రెక్కీ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినా.. సీసీ ఫుటేజీని సేకరించి పరిశీలిస్తున్నామని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.