chandrababu: రాజధాని రైతులు చేసిన పాపం ఏమిటి?: చంద్రబాబు

రాజధాని రైతులు చేసిన పాపం ఏమిటని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ న్యాయస్థానం నుంచి

Updated : 17 Dec 2021 20:22 IST

తిరుపతి: రాజధాని రైతులు చేసిన పాపం ఏమిటని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. సభావేదికపై జై అమరావతి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘అమరావతి న్యాయస్థానం నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసిన మీ అందరినీ అభినందిస్తున్నా. 45 రోజులు 450 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. అమరావతి ఉద్యమం మొదలైనప్పటి నుంచి దాదాపు 180 మంది చనిపోయారు. వేల సంఖ్యలో కేసులు పెట్టారు. ఒక్క పాదయాత్రలోనే 2,500 మందిపై వందకు పైగా కేసులు పెట్టారు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన దద్దమ్మ ప్రభుత్వం ఇది.  2014లో రైతులందరూ ఆలోచించి రాజధాని కోసం పంట భూములు ఇచ్చారు. హైదరాబాద్‌ అనుభవం ఉందని చెప్పి భూములు తీసుకున్నాం.

జగన్‌ ఎన్నికల ముందు ఏం చెప్పారు? అసెంబ్లీలో ఏం చెప్పారు? ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టడం నాకిష్టం లేదు.. రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పారు. ఎన్నికల ముందు ఏం చెప్పారో గుర్తు తెచ్చుకోవాలి. మడమతిప్పనన్న జగన్‌.. అమరావతిపై ఎందుకు మాట తప్పారు? అమరావతిపై కుల ముద్రవేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారందరిదీ ఏ కులం? జగన్‌ ఇష్టానుసారం చేస్తే కుదరదు. అమరావతి ఏ ఒక్కరిదో కాదు... ప్రజలు కోరుకున్న ప్రజా రాజధాని. అమరావతి మునిగి పోతుందని దుష్ప్రచారం చేశారు. మూడేళ్లలో ఎప్పుడైనా మునిగిందా? అమరావతిలో భూమి గట్టిది కాదన్నారు.. హైదరాబాద్‌ కంటే గట్టి నేల అని చెన్నై ఐఐటీ నిపుణులు తేల్చారు. ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని అపోహలు సృష్టించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. వేంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నా... ధర్మ పోరాటంలో అంతిమ విజయం మనదే. త్యాగం, పోరాటం అమరావతి రైతులది. వారి త్యాగం 5కోట్ల ఆంధ్రుల కోసమే’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

‘‘అసెంబ్లీ, సెక్రటేరియట్‌, హైకోర్టు .. అమరావతి రైతుల భూముల్లోనే ఉన్నాయి. రాజధానికి నిధులు లేవని జగన్‌ అంటున్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అమరావతిని అభివృద్ధి చేయొచ్చు. అమరావతి భూములతోనే ఆర్థిక వనరులు సమకూర్చుకోవచ్చు. అమరావతిపై ఇప్పటికే రూ.10వేల కోట్లు ఖర్చు చేశాం. అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో కావాలి... రాజధాని మాత్రం అమరావతిలో ఉండాలి. అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత 5కోట్ల ఆంధ్రులదే.  అమరావతి రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. రాజధాని రైతుల త్యాగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా’’ అని చంద్రబాబు అన్నారు. అమరావతి ఉద్యమానికి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇచ్చిన రూ.5లక్షల విరాళాన్ని చంద్రబాబు చేతుల మీదుగా అమరావతి జేఏసీ ఛైర్మన్‌ శివారెడ్డికి అందజేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని