Ap News: భావితరాల భవిష్యత్ కోసం ఒకే రాజధాని ఉండాలి: చంద్రబాబు

రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహోద్యమ

Updated : 17 Dec 2021 17:30 IST

తిరుపతి: రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహోద్యమ బహిరంగ సభలో పాల్గొనేందుకు తిరుపతికి వచ్చిన చంద్రబాబు మొదటగా శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం అని అభిప్రాయపడ్డారు. 3 రాజధానులు పెడితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మాయమాటలు చెబితే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని పేర్కొన్నారు. ఇది 5 కోట్ల ప్రజల సమస్య అని.. రాష్ట్ర ప్రజలు, భావితరాల భవిష్యత్‌ దృష్ట్యా ఒకే రాజధాని ఉండాలన్నారు. ప్రజలు, రాష్ట్రాన్ని అన్ని విధాలా రక్షించాలని ఆ ఏడుకొండలవాడిని కోరినట్టు చంద్రబాబు చెప్పారు. అనంతరం అక్కడ నుంచి సభకు బయలుదేరారు.

అంతకుముందు మహోద్యమ బహిరంగసభలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబుకు రేణిగుంట విమానాశ్రయంలో అమరావతి ఐకాస, తెదేపా నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ చంద్రబాబుకు డిప్యూటీ ఈవో లోకనాథం, ఓఎస్డీ రామకృష్ణ తదితరులు స్వాగతం పలికారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని