By election: ముగిసిన హుజూరాబాద్‌, బద్వేల్‌ ఉపఎన్నిక ప్రచారం

హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఎవరూ ఓటర్లను ప్రలోభపెట్టకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) శశాంక్ గోయల్

Updated : 27 Oct 2021 19:26 IST

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఎవరూ ఓటర్లను ప్రలోభపెట్టకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ అధికారులను ఆదేశించారు. ఉప ఎన్నిక పోలింగ్ ఏర్పాట్లపై కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఈఓ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పోలింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల నియమావళి కఠినంగా అమలు చేయాలన్నారు. కొవిడ్ మార్గదర్శకాలు పాటించేలా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోలింగ్‌ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని.. అందుకోసం 20 కంపెనీల కేంద్ర బలగాలను నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో మోహరించాలని ఆదేశించారు. నగదు, మద్యం పంపిణీ లేకుండా చూడాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా సంఘటనలు జరిగినట్లు దృష్టికి వస్తే వెంటనే నివేదికలు పంపాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ప్రచార గడువు ఇవాళ్టితో ముగిసినందున స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గంలో ఉండకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

హుజూరాబాద్‌ ఉపఎన్నిక వివరాలు..

ఉపఎన్నిక పోలింగ్‌:    30-10-2021

ఓట్ల లెక్కింపు     ‌:    02-11-2021

మొత్తం ఓటర్లు    :    2,36,283

పురుష ఓటర్లు     :    1,18,720

మహిళా ఓటర్లు    :    1,17,563

ఉప ఎన్నిక జరగనున్న మండలాలు: 5

ఉప ఎన్నిక జరగనున్న పంచాయతీలు: 106

బద్వేల్‌ ఉపఎన్నిక.. బరిలో 15 మంది..

కడప జిల్లా బద్వేల్‌ ఉపఎన్నిక ప్రచారం ముగియడంతో ఎన్నిక నిర్వహణపై జిల్లా అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ సమీక్ష నిర్వహించారు. కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు కర్నూలు రేంజ్ డీఐజీ, మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సహా రిటర్నింగ్ అధికారులు హాజరయ్యారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మొహరించాల్సిందిగా సూచించారు. మోడల్ కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు ఇప్పటివరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఐదు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. బద్వేల్‌ ఉప ఎన్నిక రిటర్నింగ్‌ అధికారిగా కేతన్‌ గార్గ్‌ నియమితులయ్యారు. బద్వేల్‌ ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.

బద్వేల్‌ ఉపఎన్నిక వివరాలు...

ఉపఎన్నిక పోలింగ్‌:    30-10-2021

ఓట్ల లెక్కింపు     ‌:    02-11-2021

మొత్తం ఓటర్లు    :    2,15,292

పురుష ఓటర్లు     :    1,07,915

మహిళా ఓటర్లు    :    1,07,355

ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు:    22

పోలింగ్‌ కేంద్రాలు:    281

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని