Updated : 18 Nov 2021 15:05 IST

CM KCR: మా ప్రశ్న ఒక్కటే.. తెలంగాణ వడ్లు కొంటారా.. కొనరా?: కేసీఆర్‌

హైదరాబాద్: ‘‘మా ప్రశ్న ఒక్కటే.. తెలంగాణ వడ్లు కొంటారా.. కొనరా?’’ అని సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు కొత్త కోరికలు కోరడం లేదని.. పండించిన పంట కొంటారా.. కొనరా? అనే అడుగుతున్నారన్నారు. కేంద్రం అడ్డగోలుగా మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. రైతుల గోస తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఉందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెరాస ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న కేసీఆర్‌ మాట్లాడారు.

రైతులను బతకనిస్తారా? లేదా?

‘‘ఏడాదిగా దేశ వ్యాప్తంగా రైతులు నిరసన చేస్తున్నారు. సాగు చట్టాలు వద్దని డిమాండ్‌ చేస్తున్నారు. రైతులను బతకనిస్తారా? బతకనివ్వరా? నిజాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు వాదనలు చేస్తోంది. దేశంలో 40 కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి. అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నారు. బంగారం పండే భూములను నిర్లక్ష్యం చేస్తున్నారు. భారత్‌ ఆకలి రాజ్యమని ఆకలి సూచీలో వెల్లడైంది. ఆకలి సూచీలో పాకిస్థాన్‌ కంటే దిగువన భారత్‌ ఉంది. ఉత్తర భారత రైతులు దిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. దేశాన్ని పాలించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మేం తెచ్చిన సాగు విధానాలతో రైతులోకం ఓ దరికి వచ్చింది. దిక్కుమాలిన కేంద్రం బుర్రలు పని చేయడం లేదు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పింది. కేంద్రం తీరుతోనే ఇష్టం లేకున్నా ధాన్యం సాగు వద్దని చెప్పాం. వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయమని కోరాం.

దిష్ఠి తీసి భాజపా కార్యాలయంపై కుమ్మరిస్తాం

మా ఓపికకు ఓ హద్దు ఉంది. ప్రధానిని చేతులు జోడించి ఒకటే మాట అడుగుతున్నా.. వడ్లు కొంటారా? కొనరా?. దీనిపై ఆయనకు నిన్న లేఖ రాశా. దేశంలోని రైతు సమస్యలపై తెరాస నాయకత్వం తీసుకుంటుంది. ధాన్యం కొంటామని ఇప్పటి వరకు కేంద్రం హామీ ఇవ్వలేదు. యాసంగిలో ధాన్యం వద్దని చెబితే వేయాలని భాజపా అంటోంది. కేంద్రం ధాన్యం తీసుకోకపోతే దిష్టితీసి భాజపా కార్యాలయంపై కుమ్మరిస్తాం. దేశ రైతుల సమస్యల పరిష్కారం కోసం నేతృత్వం వహిస్తాం. రాష్ట్ర సాధనలో పదవులను తృణప్రాయంగా వదులుకున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మత విద్వేషాలు రెచ్చగొట్టి కాలం గడుపుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌ వంటి నాటకాలు బయటికొచ్చాయి.. ప్రజలకు తెలిశాయి.

ఎవరిది చేతగాని తనం? ఎవరిది అసమర్థత

కేసీఆర్‌ వచ్చాక విద్యుత్ సమస్య ఎలా పరిష్కారమైంది? సమర్థత ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. ఎప్పుడూ 2లక్షల మెగావాట్లు మించి వాడలేదు. మన రాష్ట్రంలో తప్ప నిరంతర విద్యుత్‌ ఎక్కడా ఇవ్వట్లేదు. ఇది ఎవరి చేతగానితనం.?ఎవరి అసమర్థత?విద్యుత్ ఇవ్వడం చేతకాక మోటార్లు పెడతామంటారు. రాష్ట్రంలో మీటర్లు ఉండవు.. నీటి తీరువా లేదు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌, రైతుబంధు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. పంట విస్తీర్ణంపై మేం అబద్ధాలు చెబుతున్నామని కేంద్రం అంటోంది. పంట పండకపోతే కల్లాల వద్దకు భాజపా నేతలు ఎందుకు వెళ్తున్నారు? అసమర్థులకు చరమగీతం పాడితేనే దేశానికి విముక్తి. దేశ సమస్యలపై పోరాటానికి తెలంగాణ నాయకత్వం వహించాల్సిందే. 

భయపెడితే కేసీఆర్‌ భయపడతాడా?

మరో పోరాటం చేయకపోతే దేశానికి విముక్తి లేదు. కేంద్రం భయపెడితే కేసీఆర్‌ భయపడతాడా?.. కేసీఆర్‌ భయపడితే తెలంగాణ వచ్చేదా? వానాకాలం పంట కొంటారా.. కొనరా? తేల్చి చెప్పండి. ఇది రైతుల జీవన్మరణ సమస్య. రైతులు విషం తాగి చావాలా?చెట్లకు వేలాడాలా? పదవులకు ఆశపడేది లేదు.. కేసులకు బయపడే ప్రసక్తే లేదు. రైతులు నష్టపోకూడదన్నదే మా ఆరాటం.. పోరాటం. అవసరమైతే ప్రతి గ్రామంలో చావుడప్పు కొడదాం. రణం చేయడంలో దేశంలో తెరాసను మించిన పార్టీ లేదు’’ అని కేసీఆర్‌ అన్నారు.

 


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని