Published : 17 Nov 2021 01:27 IST

Cm Kcr: కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది: కేసీఆర్‌

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంజాబ్‌లో మొత్తం వరిధాన్యం కొంటున్నారు కానీ, మన రాష్ట్రంలో కొనుగోలు చేయనంటోందన్నారు. కేంద్రం.. రాష్ట్రానికి, ప్రాంతానికి ఒక నీతి పాటిస్తోందని ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని మరోసారి స్పష్టం చేశారు. ఏ రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని కోరినట్లు చెప్పారు. కేంద్ర మంత్రిని కలిసి 50 రోజులు గడిచినా సమస్య పరిష్కారం కాలేదని, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తామంటే కేంద్రం నిరాకరిస్తోందన్నారు.

‘‘ఏడాదికి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని కేంద్ర ఆహారశాఖ మంత్రిని అడిగాం. జీఓఎంలో చర్చించి చెబుతామన్నారు. కానీ చెప్పలేదు. దాన్ని వదిలేసీ ఇక్కడి భాజపా నాయకులు యాసంగిలో వరి వేయాలని చెబుతున్నారు. ఇదేం నీతి. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా వ్యహరిస్తోందని భావించి రాష్ట్రంలో పంట మార్పిడి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రైతులకు పిలుపునిచ్చారు. 6,600 పైచిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. యాసంగిలో వరి వేయాలని చెప్పిన స్టాండ్‌ మీద భాజపా ఉందో? లేదో? చెప్పకుండా కొనుగోలు కేంద్రాల వద్ద డ్రామా చేయాలని చూస్తున్నారు. అసలే కోపం మీద ఉన్న రైతులు భాజపా నేతలను నిలదీస్తున్నారు. మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు భాజపా నేతలు ఎందుకు వెళ్తున్నారు. రైతులపై దాడి చేయడం క్షమించరాని విషయం. యాసంగిలో వరి వేయాలని బండి సంజయ్‌ చెప్పారా? లేదా? వర్షా కాలంలో వచ్చే ధాన్యం కొనుగోలు చేస్తారా? లేదా? కేంద్రం సమాధానం చెప్పాలి.

18న ఇందిరాపార్క్‌లో మహాధర్నా

ఉత్తర్‌ప్రదేశ్‌లో రైతులపై కార్లు ఎక్కించి తొక్కించారు. ఇక్కడేమో మా ధాన్యం కొంటారా? కొనరా?అని అడుగుతుంటే స్పష్టమైన సమాధానం చెప్పకుండా పిట్ట కథలు చెబుతున్నారు. ఇలా చేస్తే తెలంగాణ రైతులు ఊరుకోరు. తెరాసలో 60లక్షల మందికి సభ్యత్వం ఉంది. అందులో లక్షలాది మంది రైతులు ఉంటారు. యాసంగిలో వరి వేయమంటావా? వద్దా? అని తెరాస రైతులు నిలదీశారు. యాసంగిలో వరి వేయమంటారా? వద్దా? అని ప్రధానికి రేపు ఉదయం లేఖ రాయబోతున్నా. నారుమళ్లు పోస్తే రైతులు నష్టపోయే ప్రమాదముంది. ఏ విషయం వెంటనే కేంద్రం స్పష్టం చేయాలి. కేంద్రం తెలంగాణ ధాన్యం కొంటుందా? కొనదా? స్పష్టం చేయాలి. యాసంగిలో వరి వేయాలని బండి సంజయ్‌ చెప్పిన మాట మీద ఉన్నారా? లేదా? స్పష్టం చేయాలి. మీరు చెప్పిన మాట మీద నిబలడితే కేంద్రం కొనుగోలు చేస్తుందని చెప్పాలి. పొరపాటున అన్నానని చెబితే ముక్కు నేలకు రాయాలి. పోయిన యాసంగిలోని 5లక్షల టన్నుల ధాన్యం తీసుకుంటారా? లేదా?చెప్పాలి. ఎఫ్‌సీఐ తీసుకునే టార్గెట్‌ చెప్పమని కేంద్రాన్ని అడిగాం.. వెంటనే చెప్పాలి. సాగదీస్తే కుదరదు. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కాపాడేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 18న ఇందిరా పార్క్‌లో ధర్నా చేస్తాం. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులంతా ఈ ధర్నాలో పాల్గొంటారు.  18 తర్వాత రెండ్రోజులు వేచి చూస్తాం. ఆ తర్వాత రైతులు ఏ పంట వేయాలో ప్రకటన చేస్తాం. రైతులకు వాస్తవ పరిస్థితులు వివరిస్తాం’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. కొనే వరకు వెంటాడుతాం

బాయిల్డ్‌ రైసు కొనుగోలు చేయమన్నారు.. ఓకే. కానీ, ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో స్పష్టం చేయమంటున్నాం. నెలన్నర దాటినా.. అతీ, గతి లేదు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైతే ఎంతకైనా తెగిస్తాం. మాది ఉద్యమ పార్టీ. ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. వెంటాడుతాం. తెలంగాణ ఉద్యమాల గడ్డ. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాడుతాం.  పార్లమెంట్‌తో సహా అన్ని వేదికలపై కొట్లాడుతూనే ఉంటాం. 100 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ధర్నా చేసిన తర్వాత కూడా కేంద్రం స్పందించకపోతే ప్రజలే నిర్ణయిస్తారు. కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసే వరకు భాజపా నేతలను రైతుల నిలదీస్తూనే ఉంటారు. నల్ల చట్టాలు రైతుల ప్రయోజనాలను కాల రాసేవిధంగా ఉన్నాయి. సాగు చట్టాలను లోక్‌సభ, రాజ్యసభలో వ్యతిరేకించాం. ధర్నాలు కూడా చేశాం. విద్యుత్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశాం’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని