Updated : 05 Oct 2021 17:03 IST

CM Kcr: ఒక్క హుజూరాబాద్ ఎన్నిక కోసం అబద్ధాలు అడతామా?: కేసీఆర్‌

హైదరాబాద్: దళితబంధు హుజూరాబాద్ కోసం తీసుకొచ్చింది కాదని.. 1986లోనే ఈ పథకం పురుడుపోసుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. దళితబంధుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దళితుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. స్వాతంత్ర్యానికి ముందు కూడా హింసకు గురయ్యారన్నారు. అవకాశాలు లేక దళితులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేం ఇప్పటివరకు కొంతమేర చేయగలిగామని కేసీఆర్‌ వివరించారు.

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా బాగుపడిన వారున్నారా?

‘‘ఎస్సీ కార్పొరేషన్‌ను ఇందిరా గాంధీ కాలంలో ఏర్పాటు చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఆర్థిక సాయం పొంది బాగుపడిన వారు కనిపించలేదు. వచ్చే ఏడాది మార్చి లోపు 100 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తాం. ఈ పథకం అమలుకు ఇప్పుడు దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తాం. రూ.10 లక్షలతో ఎక్కడైనా, ఎన్ని వ్యాపారాలైనా చేసుకోవచ్చు. నిధులతో పలానా పని చేయాలని ప్రభుత్వం బలవంతం చేయదు. లబ్ధిదారులు బృందంగా ఏర్పడి పెద్ద పరిశ్రమ కూడా పెట్టొచ్చు. నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక  చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే. వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తాం. వచ్చే బడ్జెట్‌ నిధులతో నియోజకవర్గానికి 2వేల మందికి దళిత బంధు అందజేస్తాం. దళితుల కోసం ఒక్కో నియోజకవర్గంలో రూ.4వేల కోట్లతో రక్షణ నిధి కూడా ఏర్పాటు చేస్తాం. ఏదైనా జరిగి కుటుంబం నష్టపోతే రక్షణనిధితో ఆదుకుంటాం. ఒక్క హుజూరాబాద్ ఎన్నిక కోసం అబద్ధాలు అడతామా? సందేహం లేదు.. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. దళిత బంధు నిధులు మళ్లీ చెల్లించాల్సిన పనిలేదు. రాష్ట్రమంతా ఖర్చు చేస్తే రూ.1.80 లక్షల కోట్లు అవసరం అవుతుంది.

ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగికి కూడా దళితబంధు..

ప్రభుత్వ లైసెన్సు అవసరమయ్యే వ్యాపారాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులకు దళితబంధు ఇచ్చాం. ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఈ పథకం వర్తింపజేస్తాం. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ కుటుంబాలకు దళితబంధు ఇస్తాం. ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు. దళితబంధుతో ముడిపెట్టం. పార్టీలకు అతీతంగా లబ్ధిదారులు ఎంపిక ఉంటుంది. ప్రతి ఎస్సీ కుటుంబానికి దళితబంధు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్‌ మినహా ప్రతి జిల్లాలో దాదాపు 20 శాతం ఎస్సీలు ఉన్నారు. రాష్ట్రంలో సగటున 17.53 శాతం ఎస్సీల జనాభా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్‌ పెంచాలి. కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందే. ఇందుకోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కోసం ఎన్నోసార్లు తీర్మానం చేసి పంపించాం. ఎన్ని తీర్మానాలు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు.

2, 3 నెలల్లో ఉద్యోగ ప్రకటన

2, 3 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. దాదాపు 80వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశముందని సీఎం వెల్లడించారు. ‘‘రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. రేపు కేంద్రాన్ని శాసించే అవకాశం తెరాసకు రావొచ్చు. కేంద్రంలో తెరాసకు పాత్ర దొరికే అవకాశం కావచ్చు. ప్రధానికి మూరెడు కాకుంటే బారెడు దరఖాస్తులు ఇస్తాం. కేంద్ర సహకరిస్తే ఇంకా బలంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తాం. ఇప్పటికే 1.35లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. జోన్ల ఆమోదం కోసం పంపితే విపరీతమైన జాప్యం జరిగింది. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నిబంధన పెట్టాం. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతాం. జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉటుంది. కొత్త జిల్లాల ప్రకారం నవోదయ పాఠశాలలు అడిగితే ఇవ్వట్లేదు. భాజపా ఎంపీలు నవోదయ పాఠశాలలు మంజూరు చేయించాలి’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పలేదు

దళితులకు 3ఎకరాల భూమి ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో స్పష్టం చేశారు. దళిబంధు పథకంపై స్వల్పకాలిక చర్చలో భాగంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని చెప్పాను. దళితులకు ఎకరం ఉంటే రెండు ఎకరాలు కొనిస్తామని చెప్పాం. ఒకటిన్నర ఎకరం ఉంటే మరో ఒకటిన్నర ఇస్తామన్నాం. కరోనా కష్టకాలంలో న్యాయవాదులకు రూ.25 కోట్లు ఇచ్చాం. ప్రైవేటు టీచర్లకు బియ్యం, నగదు ఇచ్చి ఆదుకున్నాం. న్యాయవాదులకు డబ్బు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా?’’ అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

అంబేడ్కర్‌ వల్లే తెలంగాణ వచ్చిందని గతంలోనే చెప్పాను..

‘‘రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్‌ ఉజ్వలమైన పాత్ర పోషించారు. అంబేడ్కర్‌ ఆలోచించిన సరళి బయటకు వస్తుంది. అంబేడ్కర్‌ వల్లే తెలంగాణ వచ్చిందని గతంలోనే చెప్పాను. రాష్ట్రాలు ఏర్పాటు చేసే అవకాశం పార్లమెంట్‌కు ఉండాలని అంబేడ్కర్‌ చెప్పారు. అంబేడ్కర్‌ అనేక పోరాటాలు చేశారు. అయినప్పటికీ అణచివేతకు గురైన వర్గాలకు ఇప్పటికీ సాధికారత చేకూరలేదు. దేశాన్ని ఒక్క కాంగ్రెస్‌ పార్టీయే పాలించలేదు. రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. గత ప్రభుత్వాలు కొంత చేశాయి. ఎంత మార్పు వచ్చింది? నినాదాలు వచ్చాయి.. కానీ గణనీయమైన మార్పులు రాలేదు. మేం పొలాలు పంచామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెబుతున్నారు. 75 లక్షల మంది దళితులుంటే.. 13 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది. పాలమూరు లాంటి జిల్లా నుంచి లక్ష మంది వలస వెళ్లారు. తెలంగాణ ఏర్పాటును విఫల ప్రయత్నమని చెప్పే ప్రయత్నాలు జరిగాయి’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్