Cm Kcr: భవిష్యత్తులో 24 గంటల పాటు నీళ్లు అందించేలా చర్యలు: సీఎం కేసీఆర్ 

పెరుగుతున్న హైదరాబాద్‌ అవసరాలకు అనుగుణంగా రూ.1,200 కోట్లతో నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతిపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. పేదవారికి రూ.1 నల్లా కనెక్షన్‌ ఇస్తున్నామని....

Updated : 07 Oct 2021 16:43 IST

హైదరాబాద్‌: పెరుగుతున్న హైదరాబాద్‌ అవసరాలకు అనుగుణంగా రూ.1,200 కోట్లతో నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతిపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. పేదవారికి రూ.1 నల్లా కనెక్షన్‌ ఇస్తున్నామని.. రూ.5,378 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో 24 గంటల పాటు నీళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఏ రాష్ట్రంలోనూ లేరు..

‘‘మున్సిపల్‌ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చాం. పౌరుల భాగస్వామ్యం ఉండేలా చట్టాలు తీసుకు వచ్చాం. పట్టణాల్లో పచ్చదనం పెరిగేలా 10 శాతం గ్రీన్‌బడ్జెట్‌ కేటాయించాం. పట్టణాల్లో చెరువులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచి సకాలంలో చెల్లిస్తున్నాం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు భారీగా పెంచాం. మంత్రి స్థాయి హోదా ఉన్న జడ్పీ ఛైర్మన్‌కు గౌరవ వేతనం రూ.6వేలు ఇచ్చేవారు. స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 25 శాతం కోత విధించింది. నిధుల కోసం గ్రామ పంచాయతీల ఆస్తులను తాకట్టు పెట్టుకొమ్మని కేంద్రం చెప్తోంది. గతంలో బోరు బావుల్లో పడి ఎందరో పిల్లలు చనిపోయారు. ఇప్పుడు పల్లెల్లో నిరుపయోగంగా ఉన్న బోరుబావులను పూడ్చేశాం. ప్రతి గ్రామానికి నెలకు రూ.5 లక్షలు ఆదాయం సమకూరేలా చేస్తున్నాం. గతంలో గ్రామాల్లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఏ ఊరికి వెళ్లినా.. ఎమ్మెల్యేలు, మంత్రుల ముందు బిందెలతో నిరసనలు జరిగేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. తెలంగాణ ఫ్లోరైడ్‌  రహిత రాష్ట్రమని పార్లమెంట్‌లో కేంద్రమే చెప్పింది. గతంలో 9 వేల గ్రామాలకు 3 వేల పంచాయతీ కార్యదర్శులు ఉండేవారు. ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండేలా నియామకాలు చేశాం. ప్రస్తుతం 9,800 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ప్రతి ఊరికొక పంచాయతీ కార్యదర్శి ఏ రాష్ట్రంలోనూ లేరు.

త్వరలో పల్లె దవాఖానాలు..

‘‘300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్తే 350 అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపై పల్లె దవాఖానాలను ఏర్పాటు చేయనున్నాం. ప్రజలకు పల్లెల్లోనే వైద్యం అందేలా ఏర్పాటు చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు పెంచుతాం’’ అని సీఎం పేర్కొన్నారు.

ఆ జాబితాలో తెలంగాణ ముందుంది..

అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది. కేంద్ర ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరుస్తున్న నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. రాష్ట్ర జాబితాలోని అనేక అంశాలను కేంద్ర జాబితాలోకి చేర్చారు. భాజపా, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాల అధికారాలను తగ్గించాయి. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీలో చేరుస్తామంటే భాజపా పాలిత రాష్ట్రాలు వ్యతిరేకించాయి. పెట్రోల్‌, డీజిల్‌పై వచ్చే ఆదాయం కూడా రాకుండా చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. రాష్ట్రాల హక్కుల కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతాం. పట్టణ, స్థానిక సంస్థలకు కలిపి ప్రతి నెలా రూ.227 కోట్లు ఇస్తున్నాం. గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.112 కోట్లు విడుదల చేస్తున్నాం.

కరీంనగర్‌ను డల్లాస్‌లా చేస్తానని అనలేదు..

నగరం అంటే కొన్నాళ్లలో నిర్మించేది కాదు. వందల ఏళ్లుగా క్రమంగా విస్తరిస్తోంది. ఎన్నో దశాబ్దాలుగా హైదరాబాద్‌ అంతర్జాతీయ నగరంలో ఉంది. నగరాల అభివృద్ధికి ఏటా రూ.10వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగాం. ఎన్నిసార్లు అడిగినా కేంద్రం నుంచి స్పందన లేదు. హైదరాబాద్‌లో వరదలు, ముంపునకు కారణం కాంగ్రెస్‌ కాదా?దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్‌ ఎందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పర్చలేదు? హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలంటే రూ.15 వేల కోట్లు అవసరం. హైదరాబాద్‌ ఇస్తాంబుల్‌లాగా ఎదగాలని కలలు కనడం తప్పా?కలలు కంటాం, వాటిని నెరవేర్చుకొనేందుకు ప్రయత్నిస్తాం. కరీంనగర్‌ను డల్లాస్‌లా చేస్తానని అనలేదు. కరీంనగర్‌ పక్కనే నది, కాలువలు అందంగా ఉంటాయి. తీర్చిదిద్దుకుంటే కరీంనగర్‌ కూడా డల్లాస్‌లాగా కనిపిస్తుందని మాత్రమే అన్నాను’’ అని సీఎం అన్నారు.

పల్లె, పట్టణ ప్రగతితో రూపురేఖలు మారాయి..

గ్రామాల్లో రైతుల కోసం లక్ష కల్లాలు నిర్మిస్తున్నాం. ఉపాధి హామీ పథకం పనులను కేంద్రమంత్రి, అధికారులు ప్రశంసించారు. నరేగా కింద చేపట్టిన పనుల గురించి తెలిసి.. ప్రధాని కూడా ప్రశంసించారు. ఒక్కో సీజన్‌లో రూ.300 కోట్ల వరి ధాన్యం సేకరించాం. వరి ధాన్యం కొనేది లేదంటూ ఇప్పుడు కేంద్రం చెప్తోంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరాం. మనం చెల్లించిన పన్నుల నుంచే కేంద్రం నిధులు ఇస్తోంది. రాష్ట్రంలో 2,600కుపైగా రైతు వేదికలు నిర్మించాం. కల్తీ విత్తనాల విక్రేతలపై పీడీ చట్టం నమోదు చేస్తున్నాం. పచ్చదనం పెంపు నిరంతర యజ్ఞంలా కొనసాగుతోంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్ల రాష్ట్రం రూపురేఖలు మారిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.3,618 కోట్లు ఖర్చు చేసి 13,800 కి.మీ.రోడ్లు నిర్మించింది. తెరాస ప్రభుత్వం ఏడేళ్లలో రూ. 8,536 కోట్లు వెచ్చించి 18,600 కి.మీ.రోడ్లు నిర్మించాం. గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్‌ చేసిన ఖర్చు రూ.12,170 కోట్లయితే.. ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం రూ.58,303 కోట్లు ఖర్చు చేసింది’’ అని సీఎం వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని