TS Congress on Pegasus: ఓటమి భయంతోనే ఫోన్ ట్యాపింగ్‌: దాసోజు

ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా భారత్‌లోని చాలామంది ఫోన్లను పెగాసిస్‌ తన అధీనంలోకి తీసుకుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫోన్లను

Updated : 22 Jul 2021 15:41 IST

హైదరాబాద్: ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా భారత్‌లోని చాలామంది ఫోన్లను పెగాసిస్‌ తన అధీనంలోకి తీసుకుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫోన్లను హ్యాక్‌ చేస్తోందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇందిరా పార్కు వద్ద నిరసనకు దిగారు. ఏఐసీసీ పిలుపుతో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ప్రైవసీ యాక్ట్‌ ప్రకారం ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు. ఓటమి భయంలోనే ప్రతిపక్షాలు, న్యాయమూర్తులు, మీడియా ప్రతినిధుల ఫోన్లను ప్రధాని ట్యాప్‌ చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ చేయిస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ధర్నాలో పాల్గొన్న సీతక్క మాట్లాడుతూ.. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతూ హక్కులకు భంగం కలిగిస్తున్నాయి.సమాచారాన్ని విదేశాల చేతుల్లో పెడుతున్నారు. దేశ భద్రతకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ముప్పు తెస్తున్నారు’’ అని అన్నారు.


ఉద్రిక్తంగా కాంగ్రెస్‌ ధర్నా..

ఇందిరా పార్క్‌ వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. పెగాసస్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగారు. ధర్నా ముగిసిన తర్వాత ర్యాలీగా రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు నేతలు యత్నించారు. ఇందిరా పార్క్‌ వద్ద కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్కను పోలీసులు అదుపులోకి తీసుకొని అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తామన్నా అరెస్టు చేస్తున్నారంటూ మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు