TS CONGRESS: కారునో..పతంగినో నమ్ముకుంటే మోసపోతారు: రేవంత్‌రెడ్డి

యువత ఆత్మబలిదానాలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరాపార్క్‌ వద్ద  కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో

Published : 15 Aug 2021 02:06 IST

హైదరాబాద్‌: యువత ఆత్మబలిదానాలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరాపార్క్‌ వద్ద  కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీ గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్ర్యం తేవడానికి కాంగ్రెస్‌ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగిందని, నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్‌ పార్టీ అని గుర్తు చేశారు. వైఎస్సార్‌ నేతృత్వంలో రిజర్వేషన్లు కల్పిస్తే ఎంతో మంది మైనార్టీలకు అవకాశాలు లభించాయన్నారు. రాష్ట్రపతి, ముఖ్యమంత్రి పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్‌ మాత్రమేనన్నారు. 

‘‘కాంగ్రెస్‌ పార్టీ మీదే, దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీదే. కారునో.. పతంగినో నమ్ముకుంటే మోసపోయేది మీరే. ట్రిపుల్‌ తలాక్‌, ఎన్‌ఆర్సీ, సీఏఏ వంటి చట్టాలను వ్యతిరేకించింది కాంగ్రెస్‌ మాత్రమే. కాంగ్రెస్‌ పార్టీ వద్ద 200 మంది ఎంపీలు ఉంటే అలాంటి చట్టాలు తెచ్చే ధైర్యం చేసేవారా? మోదీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి ఉన్నది కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే. అసద్‌ చెప్పారనే మైనార్టీల ఓట్లు కేసీఆర్‌కు వెళ్లాయి. కారు స్టీరింగ్‌ తన చేతిలో ఉందని చెప్పుకునే అసద్‌, ట్రిపుల్‌ తలాక్‌ కు అనుకూలంగా రంజిత్‌రెడ్డి  ఎలా ఓటు వేస్తారు? మైనార్టీలకు ఎవరి వల్ల నష్టం జరుగుతుందో చెప్పాలనే మైనార్టీ గర్జన చేపట్టాం. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెరాసకు వేసే ఓటు భాజపాకు వెళ్తుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు, ఇంత వరకు ఒక్కరికి కూడా మంజూరు చేయలేదు. మైనార్టీలకు శత్రువైన కేసీఆర్‌ను కొట్టాలంటే మధ్యలో అసద్‌ అడ్డు ఉన్నారు. మోదీకి మద్దతుగా నిలిచిన కేసీఆర్‌ పార్టీని ఓడించాలి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు విద్య, ఉపాధి అవకాశాలు వస్తాయి. రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. 12శాతం రిజర్వేషన్‌ ఇస్తే ముస్లింలకు 20..30వేల ఉద్యోగాలు వస్తాయి. మైనార్టీ ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్‌  ప్రతి ముస్లిం కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలి. దళిత బంధు మాదిరిగా మైనార్టీ బంధు ఇవ్వాలి’’ అని రేవంత్‌రెడ్డి డిమాండ్‌  చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని