Didi Vs Congress: దీదీ.. మీరు భాజపా ఏజెంట్‌ కాదంటే ఆశ్చర్యం వేస్తోంది!

భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం ఏస్తామని చెబుతున్న మమతా బెనర్జీ.. గతంలో ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరి మంత్రి పదవి ఎందుకు చేపట్టారో చెప్పాలని డిమాండ్‌ చేసింది.

Published : 01 Nov 2021 19:59 IST

మమతా బెనర్జీపై విరుచుకుపడ్డ కాంగ్రెస్‌

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ వల్లే మోదీ శక్తిమంతమయ్యారంటూ తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది. భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం ఏస్తామని చెబుతున్న మమతా బెనర్జీ.. గతంలో ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరి మంత్రి పదవి ఎందుకు చేపట్టారో చెప్పాలని డిమాండ్‌ చేసింది. అంతేకాకుండా భాజపా ఏజెంటుగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పనిచేయడం లేదంటే ఆశ్చర్యం వేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది.

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాన్ని ముమ్మరం చేసిన రాజకీయ పార్టీలు.. మాటల యుద్ధాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య విమర్శలు మొదలయ్యాయి. తాజాగా మూడురోజుల పాటు గోవాలో పర్యటించిన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీ కారణంగానే మోదీ శక్తిమంతమవుతున్నారని విమర్శించారు. రాజకీయాలను కాంగ్రెస్‌ తీవ్రంగా పరిగణించడం లేదని, ఆ పార్టీ నిర్ణయాలతో దేశం నష్టపోతోందని ఆక్షేపించారు. భాజపాపై తమ పార్టీ (తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ) మాత్రమే పోరాటం చేస్తోందని, దిల్లీ దాదాగిరిని ఇక ఏమాత్రం సహించమని చెప్పారు.

అయితే, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అధీర్‌ రంజన్‌ ఛౌదురి తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ‘ప్రస్తుతం భాజపా ఏజెంట్‌గా పనిచేయడం లేదంటే ఆశ్చర్యం వేస్తోంది. గతంలో భాజపా పక్షాన చేరి ఎన్‌డీఏ కేబినెట్‌లో భాగస్వామ్యం అయ్యింది ఎవరో గుర్తుతెచ్చుకోండి. అలాంటి మీరు.. ఎల్లప్పుడూ మీకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్‌ పార్టీనే విమర్శిస్తారా?’ అంటూ మమతా బెనర్జీకి అధీర్‌ రంజన్‌ ఛౌదురి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ బలహీనమైనదైతే.. పశ్చిమ బెంగాల్‌లో భాజపాను సమర్థంగా ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని