
Congress: దేశం ‘మమత’ నామస్మరణ చేస్తోందని ఆమె కలలు కంటున్నారు..!
యూపీఏ ఎక్కడుందన్న తృణమూల్ అధినేత్రి వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్
దిల్లీ: ‘యూపీఏనా! అదెక్కడుంది..?’ అంటూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. మహారాష్ట్ర అగ్రనేతలతో సమావేశమైన అనంతరం ఆమె ఇచ్చిన స్టేట్మెంట్పై కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పందించారు. వ్యక్తిగత ఆశయం, లాభాల కోసం పనిచేసే పార్టీలు భాజపాను ఎదుర్కోలేవని, అది భాజపాకే మేలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా ఆమె నామస్మరణ చేస్తోందన్న ఊహాగానాల్లో ఆమె ఉన్నారని వారు విమర్శించారు.
- మమతకు యూపీఏ అంటే ఏంటో తెలీదా? ఆమెకు మతిభ్రమించిందని నేను అనుకుంటున్నాను. భారతదేశం మొత్తం మమత నామస్మరణ చేస్తోందని ఆమె భావిస్తున్నారు. భారత్ అంటే బెంగాల్, బెంగాల్ అంటే భారత్ కాదు. గత ఎన్నికల్లో ఆమె వేసిన వ్యూహాలు ఏంటో ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. 2012లో యూపీఏ ప్రభుత్వంలో ఆరుగురు టీఎంసీ ఎంపీలున్నారు. ఆ సమయంలో ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని ఆమె కోరుకున్నారు. ఇతరుల నుంచి మాకు మద్దతు ఉండటం వల్ల ఆమె ఎత్తులు ఫలించలేదు. ఇది పాత కుట్ర. మోదీజీ అండగా ఉండటంతో ప్రస్తుతం ఆమె బలం బాగా పెరిగింది. అందుకే కాంగ్రెస్ను బలహీనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు... అధిర్ రంజన్ చౌధురీ
- మా పోరాటం అధికార పార్టీ(భాజపా)పైనే. మాతో చేరాలనుకునే వారు మాతో రావాలి. వద్దనుకుంటే వారిష్టం. భాజపాకు వ్యతిరేకంగా ఏర్పాటైన రాజకీయ కూటమిలో కాంగ్రెస్ భాగస్వామ్యం లేకుండా ఉంటుందా?... దిగ్విజయ్ సింగ్
- ప్రతిపక్షాలు విడిపోయి తమలో తాము పోరాడకూడదు. అంతా కలిసి భాజపాకు వ్యతిరేకంగా పోరాడాలి... మల్లిఖార్జున ఖర్గే
- కాంగ్రెస్ లేని యూపీఏ, ఆత్మ లేని దేహం వంటిదే... కపిల్ సిబల్
- భారత రాజకీయాల గురించి అందరికీ తెలుసు. కాంగ్రెస్ లేకుండా ఎవరైనా భాజపాను ఓడించగలరని అనుకుంటే అది కలగానే మిగిలిపోతుంది... కేసీ వేణుగోపాల్
- జలై 28, 2021న బెంగాల్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధ్యక్షురాలి నివాసంలో సమావేశమయ్యారు... సెప్టెంబర్ ఏడున ఈడీ నోటీసులు వచ్చాయి. ఆ తర్వాత అన్నీ మారిపోయాయి... మాణికం ఠాగూర్
విపక్షాలను సంఘటితం చేయడంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ వైఫల్యం చెందుతోందని ఇటీవల మమత బెనర్జీ తరచూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్యప్రగతిశీల కూటమి(యూపీఏ) అస్తిత్వాన్నే ప్రశ్నించారు. మరాఠా నేతల్ని కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ అంటూ ఏమీ లేదని వ్యాఖ్యానించారు. అలాగే రాజకీయాల్లో నిరంతర ప్రయత్నం తప్పనిసరని, ఎక్కువ సమయం విదేశాల్లో ఉండకూడదంటూ రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండా విమర్శలు చేశారు.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.