Congress: నిఘా పెట్టడంలో ‘జేమ్స్‌ బాండ్‌’..!

అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నిఘా పెట్టడంలో జేమ్స్‌ బాండ్‌గా ఉందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ విమర్శించారు.

Updated : 02 Aug 2021 05:49 IST

కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ ఆరోపణ

దిల్లీ: పెగాసస్‌ హ్యాకింగ్‌ ఉదంతంపై విచారణ జరిపించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలు ఒత్తిడి తెస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నాలను భాజపా ముమ్మరం చేసింది. ముఖ్యంగా పార్లమెంటును స్తంభింపజేస్తోన్న కాంగ్రెస్‌ తీరుపై కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నిఘా పెట్టడంలో జేమ్స్‌ బాండ్‌గా వ్యవహరించిందని విమర్శించారు. ప్రస్తుతం అవాస్తవ, కల్పిత అంశంపై ఆందోళనకు దిగుతూ విలువైన పార్లమెంట్‌ సమయాన్ని వృథా చేస్తోందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు కేంద్రప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తూ అరుపులు అరచి పారిపోయే (Rant and Run) విధానాన్ని అనుసరిస్తున్నాయని రాజ్యసభలో అధికారపక్ష ఉపనేత ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ విమర్శించారు. అన్ని అంశాలపై చర్చ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వివిధ అంశాలపై చర్చలు జరపడానికి చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఉభయసభలను నడవకుండా కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ సమావేశాలను అనుకున్న సమయానికన్నా ముందే ముగిస్తారని వస్తోన్న వార్తలను తోసిపుచ్చారు. ముందుగా నిర్దేశించిన విధంగా ఆగస్టు 13వరకు పార్లమెంట్‌ సమావేశాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, పెగాసస్‌ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తోన్న సమయంలో ఈ అంశంపై త్వరలోనే సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ప్రస్తుత లేదా విశ్రాంత న్యాయమూర్తితో స్వతంత్రంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రముఖ పాత్రికేయులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌ సహా సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌, న్యాయవాది ఎం.ఎల్‌.శర్మలు వేసిన వ్యాజ్యాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీనిపై ద్విసభ్య ధర్మాసనం గురువారం వాదనలు విననున్నట్లు సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని