యూపీ ఎన్నికలు.. 40 శాతం టికెట్లు మహిళలకే : ప్రియాంక

కొద్ది నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫు నుంచి 40 శాతం టికెట్లను మహిళలకు రిజర్వ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. మహిళలు మార్పు తీసుకురాగలరని, వారు మరో అడుగు ముందుకు వేయాల్సి ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. 

Updated : 19 Oct 2021 18:01 IST

మహిళలు మార్పు తీసుకురాగలరు

లఖ్‌నవూ: కొద్ది నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫు నుంచి 40 శాతం టికెట్లను మహిళలకు రిజర్వ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. మహిళలు మార్పు తీసుకురాగలరని, వారు మరో అడుగు ముందుకు వేయాల్సి ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా వాద్రా అన్నారు. 

ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ..‘ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాలికల కోసం, మార్పును కోరుకునే మహిళల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా నన్ను నిర్బంధించి, సీతాపుర్ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లిన మహిళా పోలీసు సిబ్బంది కోసమూ ఈ నిర్ణయం తీసుకున్నాం. మహిళలు మార్పు తీసుకురాగలరు. వారు మరో అడుగు ముందుకు వేయాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్న విద్వేష రాజకీయాలను మహిళలు మాత్రమే అంతం చేయగలరు. మీరు నాతో కలిసి పనిచేయాలని అభ్యర్థిస్తున్నా’ అని అన్నారు. అలాగే అభ్యర్థి సామర్థ్యమే టికెట్‌ను నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలపై జరిగే అఘాయిత్యాలను కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ ఉంటుంది. కొంతకాలం క్రితం అక్కడ జరిగిన ఉన్నావ్‌, హథ్రాస్ అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈసారి ఎన్నికల్లో మంచి పనితీరు ప్రదర్శించాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. సమర్థవంతమైన నాయకత్వం ఉండాలంటూ అసమ్మతి నేతలు చేస్తోన్న విమర్శలకు చెక్ పెట్టాలని చూస్తోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని