Updated : 22 Sep 2021 16:51 IST

TS News: స్వాతంత్ర్యోద్యమంలా పోరాడాలి: మహాధర్నాలో సీతారాం ఏచూరి

హైదరాబాద్: దేశాన్ని కాపాడుకోవాలంటే ప్రజా ఉద్యమాలు జరగాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రజాస్వామ్యానికి ఉన్న నాలుగు స్తంభాలను ప్రధాని నరేంద్రమోదీ ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందిరాపార్కు సమీపంలోని ధర్నా చౌక్‌ వద్ద అఖిలపక్షాలు నిర్వహించిన మహాధర్నాలో సీతారాం ఏచూరి సహా వివిధ పార్టీల నేతలు మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తు్న్నారని ఏచూరి ఆరోపించారు. స్వాతంత్ర్యోద్యమం మాదిరిగా పోరాటాలు జరపాలని.. రానున్న రోజుల్లో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

భాజపాకు తెరాస బీ టీం: మధు యాష్కీ

దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఒకే వేదికపైకి వచ్చాయని.. భారత రాజకీయాలకు ఇది ఒక మలుపు అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. మోదీ సర్కార్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. కరోనాతో దేశం అల్లకల్లోలం అయితే మోదీ మాత్రం విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆక్షేపించారు. జాతీయ స్థాయి ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెట్టడం దారుణమని.. వాటిని అంబానీ, ఆదానీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని మధు యాష్కీ ఆరోపించారు. భాజపాకు తెరాస బీ టీం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు తెరాస ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు జరిగేవి కాదన్నారు. తెలంగాణలో 19 పార్టీల పునరేకీకరణ జరిగిందని ఆయన చెప్పారు. 

రాజకీయ ఐక్యత సాధిస్తే వారిని ఓడించొచ్చు: నారాయణ

రూ.లక్షల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిన వారిని ప్రధాని మోదీ కాపాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. దేశంలో మోదీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఐక్యంగా నిర్వహించిన మొదటి సభ ఇది అని చెప్పారు. ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రశ్నిస్తున్న వారిని జైలుకు పంపుతున్నారని విమర్శించారు. రూ.3లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రూ.30వేల కోట్లకు ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని నారాయణ ఆరోపించారు. రాజకీయ ఐక్యత సాధిస్తే భాజపా, తెరాసలను ఓడించ వచ్చని చెప్పారు. 

కొత్త వ్యవసాయ చట్టాలతో పెత్తనం కార్పొరేట్ల చేతుల్లోకి: రావుల

రైతులు కరోనాను ఎదిరించి దేశానికి అన్నం పెట్టారని.. రైతులను సంప్రదించకుండా కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో పెత్తనం కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. పోడు భూములు సాగు చేస్తున్న వారికి పట్టాల కోసం 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చిందని గుర్తు చేశారు. గిరిజనుల హక్కుల కోసం అక్టోబర్ 5న చేపట్టే నిరసన కార్యక్రమంలో అంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడిగా తీసుకున్న ఈ నిర్ణయంలో తెదేపా పాల్గొంటుందని స్పష్టం చేశారు. 

దేశవ్యాప్త బంద్‌ విజయవంతం చేయాలి: తమ్మినేని వీరభద్రం

ఈనెల 27న తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఈ బంద్‌ వ్యాపారులు, సామాన్య ప్రజలపై కాదని.. మోదీ ప్రభుత్వం మీద అని  చెప్పారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చేపడుతున్న నిరసన గ్రామ స్థాయికి చేరాలన్నారు. అక్టోబర్‌ 5న ఆదిలాబాద్‌ నుంచి అశ్వారావుపేట వరకు 400 కి.మీ మేర ఎక్కడికక్కడ రోడ్లు దిగ్బంధించాలన్నారు. కేసీఆర్‌ సర్కారు పోడు భూములపై నిరంకుశంగా వ్యవహరిస్తోందని.. గ్రామాల్లో తెరాస నేతలు తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు.

ప్రభుత్వ భూముల అమ్మకాన్ని ఆపాలి: చాడ

కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచారని.. వ్యవసాయాన్ని కార్పొరేట్‌ పరం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని.. అక్రమ కేసులు బనాయిస్తు్న్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల అమ్మకాన్ని ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కృష్ణా జలాల విషయంలో తీరని ద్రోహం: నాగం జనార్దన్‌రెడ్డి

తెలంగాణలో ఆర్థికంగా బలపడింది కేసీఆర్‌ కుటుంబమేనని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి కేసీఆర్‌ తీరని ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన అవినీతిపై పోరాడాలని పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని