Chintamaneni Prabhakar: ఎట్టకేలకు దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌ విడుదల

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు ఎట్టకేలకు విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు అందించి చింతమనేనిని విడుదల చేశారు...

Published : 31 Aug 2021 01:37 IST

దెందులూరు: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు ఎట్టకేలకు విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు అందించి చింతమనేనిని విడుదల చేశారు. నిన్న విశాఖ జిల్లా చింతపల్లి వద్ద పోలీసులు చింతమనేనిని అదుపులోకి తీసుకుని రాత్రంతా అక్కడే ఉంచారు. ఉదయం చింతపల్లి నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు తరలించారు. రెండు రోజుల కిందట పెట్రో ధరల పెంపును నిరసిస్తూ చింతమనేని ఆందోళన చేపట్టారు. దెందులూరులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై ఒక వేడుకలో పాల్గొనడానికి వెళ్లిన చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

చింతమనేని అరెస్టు విషయాన్ని కుటుంబసభ్యులకు, సన్నిహితులకు తెలియకుండా ఉంచారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయనను ఎక్కడ ఉంచారన్న విషయాలు కూడా పోలీసులు గోప్యంగా ఉంచారు. ఎట్టకేలకు పోలీసుల నోటీసు అందుకున్న చింతమనేని తన స్వగ్రామమైన పెదవేగి మండలం దుగ్గిరాల చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న చింతమనేనిని తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్ ద్వారా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. తన అరెస్టుకు కారణాలను చంద్రబాబుకు చింతమనేని వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.. తనపై కక్షపూరితంగా కావాలనే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. నియోజకవర్గంలో అన్ని పోలీస్ స్టేషన్‌లలో తనపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. విశాఖ జిల్లాలో ఉన్న తనని పోలీసులు అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని