Published : 29 Dec 2021 01:38 IST

Sonia Gandhi: చరిత్రను తారుమారు చేసేందుకుప్రయత్నం..: సోనియా గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రసంగం

దిల్లీ: శక్తిమంతమైన భారత్‌ను తయారు చేసేందుకు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌ నేతలు వేసిన దృఢమైన పునాదులను బలహీనపరచేందుకు హేయమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ద్వేషం, పక్షపాత భావజాలం కలిగిన విభజన సిద్ధాంతాలతో కూడిన కొందరు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ 137వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి సోనియా ప్రసంగించారు.

‘చరిత్రను వక్రీకరిస్తున్నారు. దేశంలో ‘గంగా జమున’ సంస్కృతిని తుడిచిపెట్టడానికి హేయమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీ మౌనంగా చూస్తూ ప్రేక్షకపాత్ర వహించదు. దేశ వారసత్వాన్ని నాశనం చేసే వారిని అడ్డుకుంటాం’ అని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిజ్ఞ చేశారు. స్వాతంత్ర్యోద్యమంలో ఎటువంటి పాత్ర లేని కొన్ని ద్వేషం, పక్షపాత భావజాలం కలిగిన విభజన శక్తులు.. ప్రస్తుతం సమాజంలోని సెక్యులర్‌ వ్యవస్థను నాశనం చేస్తున్నాయని దుయ్యబట్టారు. మహాత్మా గాంధీని దూషించే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ మహారాష్ట్రలో ఓ హిందూమత నాయకుడిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సోనియాగాంధీ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.

‘తమకు దక్కని పాత్రను వారికి నచ్చిన విధంగా చరిత్రను తిరగరాస్తున్నారు. అవి వారిలో కొత్త దురాలోచనలు, భయాలు కలిగించడంతోపాటు శత్రుత్వాన్ని కూడా పెంచుతాయి. అదే సందర్భంగా మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని సంప్రదాయాలను కూడా ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు’ అంటు కేంద్ర ప్రభుత్వంపై సోనియా గాంధీ పరోక్షంగా మండిపడ్డారు. అయినప్పటికీ మనం నమ్ముకున్న సిద్ధాంతాలపై రాజీపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ కార్యకర్తలకు సూచించారు. ఇక ఎన్నికల ఫలితాలను ప్రస్తావించిన ఆమె.. ఎన్నికల్లో గెలుపు, ఓటమిలు అనివార్యమన్నారు. ప్రజలకు సేవ చేయడానికి ఉన్న మన నిబద్ధతే శాశ్వతమని ఉద్ఘాటించిన సోనియా గాంధీ, ప్రజా వ్యతిరేక కుట్రలను ఎదుర్కోవడానికి ఎలాంటి త్యాగానికైనా పార్టీ సిద్ధమన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని