
AP News: ఏపీలో కేంద్ర పథకాల పేర్లు ఇష్టమొచ్చినట్టు మార్చడం కుదరదు: స్మృతి ఇరానీ
దిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను రాష్ట్రాలు తమకు నచ్చినట్టు మార్చడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర పథకాలకు ఏపీలో జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పేర్లు పెట్టడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐసీడీఎస్, ఐసీపీఎస్ పథకాలకు కేంద్రం కేటాయించిన రూ.187 కోట్లకు లెక్కలు చూపాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయగా.. ఈమేరకు కేంద్ర మంత్రి స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చడం కుదరదని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి.. కేంద్ర పథకాలకు సీఎం జగన్ పేర్లు పెట్టడంపై నివేదిక కోరారు. రఘురామకృష్ణరాజు రాసిన లేఖకు సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు కేంద్రమంత్రి పేర్కొన్నారు. పథకాల పేర్లు మార్పు, ఆ విషయంలో తీసుకున్న చర్యలపై నివేదిక పంపాలని ఆదేశించినట్టు ఎంపీ రఘురామకు రాసినలేఖలో కేంద్ర మంత్రి వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.