AP News: తేలని దుగ్గిరాల పంచాయతీ .. తెదేపా ఎంపీపీ అభ్యర్థి బీసీ కాదన్న కలెక్టర్‌

గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక కొత్త మలుపు తిరిగింది. ధ్రువపత్రాల ఆధారంగా తెదేపా ఎంపీపీ అభ్యర్థి జబీన్‌ బీసీ కాదని జిల్లా పాలనాధికారి వివేక్‌ యాదవ్‌ స్పష్టం

Published : 16 Oct 2021 02:11 IST

అమరావతి: గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక కొత్త మలుపు తిరిగింది. ధ్రువపత్రాల ఆధారంగా తెదేపా ఎంపీపీ అభ్యర్థి జబీన్‌ బీసీ కాదని జిల్లా పాలనాధికారి వివేక్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. గతంలో తహశీల్దార్‌ ఇచ్చిన నివేదికను కలెక్టర్‌ సమర్థించారు. ఈమేరకు 38పేజీల కుల ధ్రువీకరణ నివేదికను శుక్రవారం ఎంపీపీ అభ్యర్థి జబీన్‌కు, హైకోర్టుకు జిల్లా కలెక్టర్‌ పంపారు. దీంతో దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక వ్యవహారం మళ్లీ మొదటి కొచ్చింది.

దుగ్గిరాల మండలంలో మొత్తం మొత్తం 18 ఎంపీటీసీ సభ్యుల స్థానాలు ఉండగా 9 తెదేపా, జనసేన 1, వైకాపా 8 స్థానాలు గెలుచుకున్నాయి. తెదేపాకు మెజారిటీ స్థానాలు వచ్చాయి. ఎంపీపీ, ఇతర పదవుల ఎంపిక కోసం ఇప్పటికే రెండుసార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించినా తెదేపా, జనసేన సభ్యులు హాజరుకాకపోవడంతో కోరం లేక వాయిదా పడింది. తెదేపా ఎంపీపీ అభ్యర్థి బీసీ కులధ్రువీకరణ పత్రానికి చేసిన దరఖాస్తు తిరస్కరించడంతో ఉత్కంఠ మొదలైంది. తెదేపా వారు కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవడం, ధ్రువపత్రం మంజూరులో జాప్యం జరగడం, జబీన్‌  న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. న్యాయస్థానం ఆదేశాలతో వారం రోజులు ఎన్నిక వాయిదా పడినప్పటికీ కలెక్టర్‌ కుల ధ్రువీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై చర్చ జోరుగా సాగింది. ఈనేపథ్యంలో జబీన్‌ బీసీ కాదంటూ కలెక్టర్‌  శుక్రవారం నివేదిక పంపడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. తెదేపా ఎంపీపీ అభ్యర్థికి బీసీ కులధ్రువీకరణ పత్రం మంజూరైతే ఎంపీపీ, ఉపాధ్యక్ష, కోఆప్షన్‌ పదవులు ఆపార్టీ వారికే దక్కుతాయని భావించారు. కానీ, కథ అడ్డం తిరగడంతో తెదేపా తీసుకోబోయే నిర్ణయం ఆసక్తికరంగా మారింది.  తెదేపా నుంచి గెలిచిన తొమ్మిది మందిలో జబీన్‌ ఒక్కరే బీసీ కావడంతో ఆమెపైనే తెదేపా ఆశలు పెట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని