Updated : 03 Nov 2021 14:23 IST

Eatala Rajendar: గడ్డిపోచలా తీసేశారు.. ఇప్పుడు వాళ్లకు అర్థమైంది: ఈటల

హుజూరాబాద్‌: ఎన్ని రకాల ప్రలోభాలు, భయభ్రాంతులకు గురిచేసినా హుజూరాబాద్‌ ప్రజలు ఆత్మగౌరవ బావుటా ఎగురవేశారని ఉప ఎన్నికలో విజయం సాధించిన ఈటల రాజేందర్‌ అన్నారు. ఉప ఎన్నికలో ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించారని.. గొప్ప మెజారిటీ తనకు అందించారని చెప్పారు. ఏడో సారి ఎమ్మెల్యేగా తనను గెలిచిపించారని.. ఏం చేసినా హుజూరాబాద్‌ ప్రజల రుణం తీర్చుకోలేనన్నారు. ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉప ఎన్నికలో విజయం సాధించిన నేపథ్యంలో హుజూరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. అనేక కుట్రలు, అబద్ధాల ఉత్తరాలు, రూ.వందల కోట్ల ఖర్చు, వందల లారీల మద్యంతో తెరాస ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు తనకు ఘన విజయాన్ని అందించారన్నారు. సీఎం కేసీఆర్‌ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయంగా ఈటల అభివర్ణించారు. 

ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను

‘‘నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా, ఎన్ని జన్మలెత్తినా హుజూరాబాద్‌ ప్రజల రుణం తీర్చుకోలేను. విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతాంగం, కుల సంఘాలు.. ఇలా అందరీ నా విజయానికి తోడ్పాటు అందించారు. కులపరంగా చీలిక తెచ్చారు.. ప్రలోభాలతో ప్రజల్ని ఒత్తిడికి గురిచేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ ఏదీ పనిచేయలేదు. తెరాస కుట్రలను ప్రజలు చీల్చి చెండాడారు. ధర్మాన్ని నిలుపుకోవాలని.. ప్రజస్వామ్యాన్ని రక్షించుకోవాలని భావించారు. తమ కళ్ల ముందు ఇన్నేళ్లూ ఉన్న బిడ్డను కాపాడుకోవాలనే వాళ్ల సంకల్పమే నన్ను విజయతీరాలకు చేర్చింది.

భాజపా అక్కున చేర్చుకుంది..

నేను తెరాసకు వెన్నుపోటు పొడిచి వెళ్లినట్లు ఆరోపణలు చేశారు. ఆ పార్టీకి నేను మోసం చేయలేదు.. బయటకు రాలేదు. వాళ్లే వెన్నుపోటు పొడిచి నన్ను బయటకు పంపారు. నా చరిత్ర తెరిచిన పుస్తకం. సూర్యుడిపై ఉమ్మివేస్తే ఎలా ఉంటుందో అలాగే జరిగింది. మొదట కృతజ్ఞతలు చెప్పాల్సింది భాజపాకి. తెరాస నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీ నన్ను అక్కున చేర్చుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నన్ను దిల్లీకి పిలిపించుకుని మాట్లాడారు. నీ చరిత్ర తెలుసని.. అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సూచనలు, సలహాలు చేశారు. పార్టీకి చెందిన చాలా మంది జాతీయ నేతలు, కేంద్రమంత్రులు, రాష్ట నేతలు మంచి సహకారం అందించారు. జిల్లా, మండల స్థాయిలో నేతలు ఎప్పటికప్పుడు ముందుండి గొప్పగా నన్ను నడిపించి విజయంలో భాగంగా పంచుకున్నారు. కింది స్థాయిలో ఉన్న భాజపా కార్యకర్తలు పులిబిడ్డల్లా పనిచేశారు. 

సోషల్‌ మీడియా పోస్టులతో చైతన్యం చేశారు

నియోజకవర్గ ప్రజలను నిత్యం చైతన్యవంతులను చేసే ప్రక్రియలో ఎంతో మంది ఉద్యోగులు, ఆర్‌ఎంపీలు, మహిళా సంఘాలు, ప్రైవేటు టీచర్లు, కవులు, కళాకారులు పనిచేశారు. ఈ యుద్ధం ఈటల రాజేందర్‌ది మాత్రమే కాదని అంతా భావించారు. సర్వే సంస్థలు కూడా ఎప్పటికప్పుడు మాకు ఫీడ్‌బ్యాక్‌ అందించి ముందుకు నడిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక విద్యార్థి సంఘాల నేతలు పనిచేశారు. కేసీఆర్‌ దుర్మార్గాలను సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకి తెలియజెప్పారు. సోషల్‌ మీడియా పోస్టులతో ప్రజల్ని చైతన్యం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది తెలుగువాళ్లు హుజూరాబాద్‌ ఫలితం కోసం ఎదురు చూశారు.

తెరాస చేసిన ఒత్తిడికి నాకు ఒక్క ఓటూ పడకూడదు.. కానీ..

నా బొమ్మ, నా గుర్తు, నా పార్టీ జెండాతో ఈటల గెలిచాడని కేసీఆర్‌ అహంకారపూరితంగా మాట్లాడి నన్ను గడ్డిపోచలా తీసేశారు. ఇప్పుడు వాళ్లకి అర్థమైంది.. ఎవరి గుర్తు మీద ఎవరు గెలిచారో! ఇన్ని నిర్బంధాలు, రూ.వందల కోట్లు ఖర్చు చేసినా ప్రజలు తెరాసను బొంద పెట్టారు. ఉప ఎన్నిక కోసం అధికార యంత్రాంగం గత 6నెలలుగా పనిచేసింది. రూ.10లక్షలకు అమ్ముడుపోతామా? రూ.10లక్షలు పదిసార్లు ఇచ్చినా మారబోమని దళిత బస్తీల్లోని ప్రజలు చెప్పారు. ప్రజలకు తెరాస చేసిన ఒత్తిడికి నాకు ఒక్క ఓటు కూడా పడకూడదు. అంతలా ఒత్తిడికి గురిచేసినా ప్రజలు తన్ని తరిమేశారు. ప్రజలే ఎక్కడికక్కడ సంఘటితంగా మారి నన్ను గెలిపించారు.

వాళ్లకి సవాల్‌ చేస్తే పిలగాన్ని పోటీకి నిలబెట్టారు..

భాజపాకు ఓటేస్తే పెన్షన్‌ పోతుందని వృద్ధులను బెదిరించారు. దళితబంధు కూడా ఆపేస్తామని భయపెట్టారు. నా సభలకు ప్రజలకు రాకుండా డబ్బులు ఇచ్చి ఆపే ప్రయత్నం చేశారు. కుట్రదారులు ఎప్పుడూ కుట్రలతోనే నాశనం అవుతారు. నాపై పోటీకి రావాలని కేసీఆర్‌, హరీశ్‌రావుకు సవాల్‌ చేస్తే రాకపోగా పిలగాన్ని నిలబెట్టారు. రెండు గుంటలు ఉన్న వ్యక్తి ఇన్ని రూ.కోట్లు ఎలా ఖర్చు చేశాడు? గతంలో నేను నిర్వహించిన పదవులకు వన్నె తెచ్చాను.. ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తా. ఈ పదవి నా తల్లిదండ్రులు ఇచ్చింది కాదు.. ప్రజలిచ్చింది. మరోసారి నా జన్మ ధన్యమైందని భావిస్తున్నా. హుజూరాబాద్‌ వచ్చి కుట్రలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడతా. వాళ్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తా. హుజూరాబాద్‌లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా’’ అని ఈటల అన్నారు. 


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని