Huzurabad: జ్వరంతో బాధపడుతున్న ఈటల రాజేందర్

ప్రజా దీవెన యాత్రలో భాగంగా మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగ 12వ రోజు..

Published : 31 Jul 2021 01:10 IST

హుజూరాబాద్‌: ప్రజా దీవెన యాత్రలో భాగంగా మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. పాదయాత్రలో భాగంగ 12వ రోజు ఈటల హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని పోతిరెడ్డిపల్లి, కొండపాక గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర కొనసాగుతుండగానే వీణవంక మండలం కొండపాక వద్ద ఈటల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నడవలేని స్థితిలో ఉండటంతో పాదయాత్రను కొండపాకలో నిలిపివేశారు. వైద్యులను పిలిపించి పరీక్షలు చేయగా జ్వరం వచ్చినట్లు నిర్ధరించారు. బీపీ90/60, షుగర్‌ లెవెల్‌ 265గా నమోదైంది. ఆక్సిజన్‌ లెవెల్స్‌ కూడా పడిపోవడంతో వెంటనే పాదయాత్ర నిలిపివేసి హైదరాబాద్‌ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. డాక్టర్ల సలహా మేరకు ఈటలను హైదరాబాద్‌ తరలించారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగానే ఉందని.. మెరుగైన వైద్యం కోసమే హైదరాబాద్‌ తరలించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈటల అనారోగ్యం పాలవడంతో పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు.

ఆగిన చోటు నుంచే అడుగులు మొదలవుతాయి: ఈటల
‘‘ 12 రోజులుగా, 222 కిలోమీటర్లకు పైగా సాగిన ప్రజా దీవెన యాత్రలో ప్రతిక్షణం నా వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం. వేయాల్సిన అడుగులు, చేరాల్సిన ఊళ్లు చాలా ఉన్నాయి. కానీ ఊహించని అస్వస్థత వల్ల ప్రజాదీవెన యాత్రని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఆరోగ్యం సహకరించగానే ప్రజా దీవెన యాత్ర మళ్లీ పునఃప్రారంభం అవుతుంది. ఆగిన చోటు నుంచే అడుగులు మొదలవుతాయి. కొండంత మీ దీవెనలతో త్వరలో ప్రజాదీవెన యాత్రతో వస్తా’’ అంటూ ఈటల రాజేందర్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. 

ఈ నెల 19న హుజూరాబాద్‌ నియోజకవర్గం కమలాపూర్ మండలం నుంచి ‘ప్రజా దీవెన యాత్ర’ను ఈటల ప్రారంభించారు. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 222 కిలోమీటర్లమేర పాదయాత్ర సాగింది. ఈటల రాజేందర్‌ అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. ఈటల కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈటలకు భాజపా అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని