
Huzurabad By Election: దళితబంధును అడ్డుకుంటున్నట్లు నిరూపించగలరా? : ఈటల సవాల్
హుజూరాబాద్: దళితబంధు పథకం అమలును అడ్డుకుంటున్నానంటూ తనపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ మండిపడ్డారు. తాను దళితబంధును అడ్డుకుంటున్నట్లు నిరూపించగలరా? అని సవాల్ చేశారు. పథకాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేసే సత్తా లేకనే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరూరూ తిరుగుతున్న ఈటల.. తెరాసపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌వి కేవలం ఎన్నికల మాటలే తప్ప చేతలు కావన్నారు. కేసీఆర్‌కు ఎన్నికల సమయంలోనే ఎస్సీలు, నోటిఫికేషన్లు గుర్తుకొస్తాయని విమర్శించారు.
‘‘ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కుర్చీ మీద కన్ను వేసిండు. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నం చేశాడని మంత్రి హరీశ్‌రావు అంటున్నారు. ఇది నిజమా? కాదా? అనేది ప్రజలే చెప్పాలి. కుడి భుజం, తమ్ముడు అని పిలిపించుకున్న నేను ఇవాళ దెయ్యాన్ని ఎలా అయ్యానో సీఎం చెప్పాలి. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చాను. అదే కేసీఆర్‌కు నచ్చలేదు. కరోనా సమయంలో అందరూ ఇంటికే పరిమితమైతే నేను ఆస్పత్రులకు తిరిగాను. అసత్య ప్రచారాలు చేస్తూ రోజుకో దొంగ ఉత్తరం పుట్టిస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపారు. దళితబంధు వద్దని నేను లేఖ రాసినట్టు నిరూపిస్తారా?దళితబంధు ప్రకటించి 70 రోజులు అయింది. ఇప్పటివరకు ఎందుకు అందరికీ అందించలేదు? ఈటల రాజేందర్ మేలు చేస్తాడే కానీ.. కీడు తలపెట్టడు. ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలి.. సంపన్నులకు కాదని కొట్లాడిన వాడిన్నేను. అవన్నీ అడిగితేనే నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారు’’ అని ఈటల అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.