National Politics: కొత్త పార్టీ, ఎన్నికల గుర్తులతోనే బాబాయ్‌, అబ్బాయ్‌ పోటీ!

బిహార్‌లో చిరాగ్‌ పాసవాన్‌, ఆయన బాబాయ్‌ కేంద్రమంత్రి పశుపతి కుమార్‌ పరాస్‌లకు కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తులకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది.

Published : 06 Oct 2021 01:16 IST

కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం

దిల్లీ: బిహార్‌లో చిరాగ్‌ పాసవాన్‌, ఆయన బాబాయ్‌ కేంద్రమంత్రి పశుపతి కుమార్‌ పరాస్‌ల మధ్య ఆధిపత్య పోరుతో లోక్‌ జన్‌శక్తి పార్టీ (LJP) రెండుగా చీలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు నాయకులకు కొత్త పార్టీ పేరు, గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. చిరాగ్‌ పాసవాన్‌కు లోక్‌ జన్‌శక్తి పార్టీ (రామ్‌విలాస్) పేరును ఖరారు చేయగా.. ‘హెలికాప్టర్‌’గా ఎన్నికల గుర్తును కేటాయించింది. ఇక పశుపతి పరాస్‌ పార్టీని ‘రాష్ట్రీయ లోక్‌ జన్‌శక్తి పార్టీ’గా పేర్కొన్న ఈసీ.. కుట్టు మిషన్‌ గుర్తును ఇచ్చింది. అక్టోబర్‌ 30న బిహార్‌లోని కుషేశ్వర్‌ ఆస్థాన్‌, తారాపూర్‌ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

లోక్‌ జన్‌శక్తి పార్టీ నేత రామ్‌ విలాస్‌ పాసవాన్‌ మరణం తర్వాత పార్టీ నిర్వహణ విషయంలో బాబాయ్‌, అబ్బాయ్‌ మధ్య తగాదాలు నెలకొన్నాయి. దీంతో ఎల్‌జేపీ పేరు, ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఈ మధ్యే ఫ్రీజ్‌ చేసింది. ఈ రెండు పక్షాల మధ్య వివాదం సమసిపోయే వరకూ ఎల్జేపీ పేరును గానీ, ఎన్నికల గుర్తు (బంగ్లా)ను గానీ ఉపయోగించకుండా నిషేధం విధించింది. ఒకవేళ ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోటీలో పెట్టాలనుకుంటే అందుబాటులో ఉన్న గుర్తులను వాడుకోవచ్చని తెలిపింది. దీంతో చిరాగ్‌ పాసవాన్‌, పశుపతి వేర్వేరుగా పార్టీల పేరు, ఎన్నికల గుర్తులతో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. వాటిని పరిశీలించిన ఈసీ ఇరు వర్గాలకు వేర్వేరు పార్టీ, గుర్తులను ఖరారు చేసింది. ఇదిలాఉంటే, లోక్‌సభలో ఎల్‌జేపీ ఫ్లోర్‌లీడర్‌గా పశుపతి కుమార్‌ పరాస్‌ కొనసాగుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు