Sharad Pawar: ప్రభుత్వాన్ని లొంగదీసుకునేందుకే ఈడీ చర్యలు: శరద్‌ పవార్‌

మహారాష్ట్ర ప్రభుత్వాన్ని లొంగదీసుకునే ప్రయత్నాల్లో భాగంగానే అధికార కూటమి నాయకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చర్యలు చేపడుతోందని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.

Published : 08 Sep 2021 01:11 IST

కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై శరద్‌ పవార్‌

పుణె: మహారాష్ట్ర ప్రభుత్వాన్ని లొంగదీసుకునే ప్రయత్నాల్లో భాగంగానే అధికార కూటమి నాయకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చర్యలు చేపడుతోందని ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కాలరాయడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే ప్రయత్నమేనని విమర్శించారు. మనీ లాండరింగ్‌ కేసులో భాగంగా అధికారంలో ఉన్న మహా వికాస్‌ అగాడీకి చెందిన పలు పార్టీల నేతలపై ఈడీ దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో శరద్‌ పవార్‌ ఈ విధంగా స్పందించారు.

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌, ఎన్‌సీపీ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సేతో పాటు శివసేన ఎంపీ భవానీగవాలీతోపాటు ఇతర నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దర్యాప్తు జరుపుతోంది. ఇలా వరుసగా అధికార కూటమికి చెందిన నేతలపై ఈడీ చర్యలను గతంలో ఎన్నడూ చూడలేదని ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తప్పుబట్టారు. కేంద్ర సంస్థలను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతోందని కేంద్రం తీరుపై దుయ్యబట్టారు. ఇక థర్డ్‌ వేవ్‌ గురించి స్పందించిన పవార్‌, కొవిడ్‌ నిబంధనలను పాటించకుండానే భారీ సమూహాలుగా సమావేశాలు, వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. అందుకే రాష్ట్రంలో ఎలాంటి సమావేశాలు జరపవద్దంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రాజకీయ పార్టీలకు సూచించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని