
Ts news: హుజూరాబాద్‌లో ‘దళితబంధు’ నిలిపేయండి.. ఈసీ ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌కు ఈసీ లేఖ రాసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. హుజూరాబాద్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధు అమలును నిలిపివేయాలని.. ఎన్నిక తర్వాత యథావిధిగా కొనసాగించవచ్చని ఈసీ స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దళితబంధు నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే ప్రక్రియ నిలిపివేసినట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో వివిధ పార్టీలకు చెందిన 30 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 30న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.
కొత్తగా 4 మండలాల్లో ‘దళితబంధు’ పైలట్ ప్రాజెక్టు..రూ.250 కోట్లు విడుదల
దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.250 కోట్లు విడుదల చేసింది. నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు కోసం ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది. ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాల్లో పథకం అమలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఖమ్మం జిల్లా చింతకానికి మండలానికి అత్యధికంగా రూ.100 కోట్లు విడుదల చేసింది. మిగతా మూడు మండలాలకు రూ. 50 కోట్లు చొప్పున విడుదల చేసింది. ఈ మేరకు రూ.250 కోట్లు ఎస్సీ అభివృద్ధి శాఖకు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు అమలు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కొత్తగా మరో నాలుగు మండలాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.