చర్చించుకునేందుకు భేషజాలెందుకు?: మైసూరా

రాజకీయ లబ్ధికోసం ఘర్షణపడి రాయలసీమ నీటి ప్రాజెక్టులను గందరగోళంలోకి నెట్టేశారని మాజీ ఎంపీ మైసూరారెడ్డి ఆరోపించారు. నదీజలాల వివాదాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..

Updated : 21 Jul 2021 13:45 IST

హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ గ్రేటర్‌ రాయలసీమకు గొడ్డలి పెట్టు అని మాజీ మంత్రి మైసూరారెడ్డి అన్నారు. దీనివల్ల్ల హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలుగొండ, సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు నీరొచ్చే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మైసూరారెడ్డి మాట్లాడారు. 

రాజకీయ లబ్ధి కోసం ఏపీ, తెలంగాణ సీఎంలు ఘర్షణ పడి కేంద్రం చేతిలో మొత్తం అధికారాన్ని పెట్టేశారని ఆరోపించారు. ఈ వివాదంపై చర్చించుకోవడానికి భేషజాలెందుకని నిలదీశారు. గ్రేటర్‌ రాయలసీమ ప్రాంతానికి ఓ ప్రభుత్వం ఉండి ఉంటే అన్యాయం జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నదీజలాల వివాదాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవాలని మైసూరా సూచించారు. రాష్ట్రానికి కేటాయించిన జలాలు ఆయా ప్రాజెక్టులకు కేటాయించుకునే స్వేచ్ఛ ఏపీకి ఉందన్నారు. రాయలసీమ హక్కుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పోరాడలేకపోతోందని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితి రాష్ట్ర సమగ్రతకు మంచిది కాదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని