Chintamaneni Prabhakar: డీజీపీ సవాంగ్ ఆర్జీవీనే మించిపోయారు: చింతమనేని

‘‘అసెంబ్లీలో సీఎం జగన్‌ కట్టుకథలు బాగా చెబుతారు. అవే కట్టుకథలు డీజీపీ కూడా బాగా వల్లెవేస్తారు. వనజాక్షి కేసును తిరగదోడాలని చూస్తున్నారు. పోలీసులతో కేసులు పెట్టిస్తారా?

Updated : 04 Sep 2021 16:03 IST

మంగళగిరి: ‘‘అసెంబ్లీలో సీఎం జగన్‌ కట్టుకథలు బాగా చెబుతారు. అవే కట్టుకథలు డీజీపీ కూడా బాగా వల్లెవేస్తారు. వనజాక్షి కేసును తిరగదోడాలని చూస్తున్నారు. పోలీసులతో కేసులు పెట్టిస్తారా? ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా..? నాపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు’’ అని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆరోపించారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అక్రమ కేసుల సినిమా చూపించటంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌.. డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మను మించిపోయారు. రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లు ఎందరో ఉన్నారు. తెదేపా క్యాడర్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు నన్ను బంతిలా వాడుకుంటున్నారు. ఎంత బలంగా కిందకి కొడితే అంతే వేగంతో పైకి లేస్తా’’ అన్నారు.

‘‘గౌతం సవాంగ్‌ మీడియా సమావేశంలో తాను డీజీపీ అనే విషయం మర్చిపోయారు. ఆయన చెప్పిన యాప్‌లో నాపై ఎన్ని కేసులు లైవ్‌లో ఉన్నాయో చెప్పాలి. కేసుల వివరాలు చెప్పేందుకు నాపేరు వాడాల్సిన పనేంటి? నాపై పెట్టిన అక్రమ కేసుల్లో వేటిని నిరూపించగలరు? అభియోగపత్రాలు నమోదు చేయకుండా మూసివేసిన కేసులపై ఏం సమాధానం చెబుతారు?’’ అని మండిపడ్డారు.

‘‘వనజాక్షి అంశాన్ని కూడా డీజీపీ ప్రస్తావించారు. ఆమె సమీపంలో కూడా నేను లేను. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా నాపై ఉన్న రౌడీషీట్ కేసు ఎత్తివేయమని కోరలేదు. వైకాపాపై అంత వ్యామోహం ఉంటే అది వేరే రూపంగా ఆ రుణం తీర్చుకోండి. డీజీపీ కుర్చీ పాకులాట కోసం నాలాంటి వారితో చెలగాటలాడటం తగదు. నేను దోపిడీదారుడిని అయితే ప్రజలే కేసులు పెడతారు. కానీ, ఏపీలో మాత్రం పోలీసులే రండి చింతమనేనిపై కేసులు పెట్టండని ఆహ్వానాలు పలుకుతున్నారు. కేసులు దొరక్క నాపై ఏవేవో కేసులు పెడుతున్నారు. నేను చేసిన తప్పులేంటో పోలీసులు ప్రజలకు తెలియపరచాలి. నన్ను అణగదొక్కడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నాతో డీజీపీ చెలగాటం ఆడొద్దని చేతులు ఎత్తి వేడుకుంటున్నా’’ అని చింతమనేని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని