G-23 Leaders: కాంగ్రెస్‌ శ్రేణుల ‘దాదాగిరి’పై మండిపడ్డ సీనియర్లు! 

కపిల్‌ సిబల్‌ ఇంటిపై దాడి చేయడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇలాంటివి దాదాగిరి చర్యలేనని మండిపడ్డారు.

Published : 01 Oct 2021 01:48 IST

కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి డిమాండ్‌

దిల్లీ: G23 అంటే ‘జీ హుజూర్‌ 23’ అని కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటిముందు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే, ఇలా కపిల్‌ సిబల్‌ ఇంటిపై దాడి చేయడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇలాంటివి దాదాగిరి చర్యలేనని మండిపడ్డారు. కపిల్‌ సిబల్‌ వంటి సీనియర్లు ఇచ్చే సూచనలు, సలహాలను స్వాగతించాలే కానీ.. అణచివేత, దౌర్జన్యం వంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

‘పార్టీ తరపున పార్లమెంట్‌ బయట, లోపల పోరాటం చేసే కపిల్‌ సిబల్‌ కాంగ్రెస్‌ పార్టీకి విశ్వాసపాత్రుడు. అటువంటి వ్యక్తి ఏ రూపంలోనైనా చేసే సూచనలు, సలహాలను స్వాగతించాలే కాని.. అణచివేత, దౌర్జన్యం వంటి చర్యలు పనికిరావు’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మరో సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ.. కపిల్‌ సిబల్‌ ఇంటిపై దాడి, దౌర్జన్యం చేసిన వార్తలు తనను షాక్‌కు గురిచేశాయన్నారు. ఇటువంటి దుర్మార్గమైన చర్యలు పార్టీకి చెడ్డపేరు తెస్తాయని.. వీటిని తీవ్రంగా ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. అసహనం, హింస వంటివి కాంగ్రెస్‌ పార్టీ విలువలకు వ్యతిరేకమని ఆనంద్‌ శర్మ అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, కాంగ్రెస్‌లో నాయకత్వలేమి, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో పరిణామాలపై పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ గళమెత్తిన విషయం తెలిసిందే. అధినాయకత్వం వైఖరిని తప్పుబట్టిన ఆయన.. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని తక్షణమే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు లేకుండానే నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘G23’ అంటే ‘జీ హుజూర్‌ 23’ కాదని చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తలు దిల్లీలోని ఆయన ఇంటి ముందు నిరసనకు దిగారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీనియర్‌ నేతలు.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు