TS News: సీఎం కేసీఆర్‌ చేస్తున్నదంతా ఒక డ్రామా: కేంద్ర మంత్రి షెకావత్‌

ఏపీ- తెలంగాణ మధ్య నీటి పంపకాలకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల మీడియా సమావేశంలో చేసిన  వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ స్పందించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై వివరణ ఇచ్చారు....

Published : 12 Nov 2021 02:04 IST

దిల్లీ: ఏపీ- తెలంగాణ మధ్య నీటి పంపకాలకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల మీడియా సమావేశంలో చేసిన  వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ స్పందించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై వివరణ ఇచ్చారు.

‘‘కేసీఆర్‌ ఇటీవల మీడియా సమావేశాల్లో నా పేరు ప్రస్తావించారు. కేసీఆర్‌ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రజలకు, దేశానికి నిజాలు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంపకాల కోసం కొత్త ట్రైబ్యునల్‌ కోసం సీఎం కేసీఆర్‌ అడిగారు. కొత్త ట్రైబ్యునల్‌  ఏర్పాటుపై కేసీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. పిటిషన్‌ వెనక్కి తీసుకోమని అడిగా... రెండ్రోజుల్లో పిటిషన్‌ వెనక్కి తీసుకుంటామని కేసీఆర్‌ అన్నారు. సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి తీసుకునేందుకు 8నెలలు పట్టింది. నెల రోజుల క్రితం పిటిషన్‌ వెనక్కి తీసుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అప్పటి నుంచి కేంద్రం నిర్వర్తించాల్సిన కార్యక్రమం మొదలైంది. ఇద్దరు సీఎంలతో కలిసి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. చాలా కాలం నుంచి జరగాల్సిన సమావేశాన్ని చొరవ తీసుకుని ఏర్పాటు చేశా. ఏడేళ్లు ఆలస్యం కావడానికి నేను, కేంద్రం ఎలా బాధ్యత వహిస్తాం. రెండు రాష్ట్రాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ప్రధాని కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. పరిధి నోటిఫై కానంతవరకు బాధ్యత ఎలా కొనసాగిస్తారు? ఇద్దరు సీఎంలు ఒప్పుకున్న తర్వాతే .. బోర్డుల పరిధిని నోటిఫై చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేశాం. న్యాయ మంత్రిత్వశాఖ అభిప్రాయం అడిగాం.. దాని కోసం వేచి చూస్తున్నాం. అవకాశం ఉన్నంత మేర ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్‌ ఇలా ఎలా మాట్లాడుతారు. కేసీఆర్‌ చేస్తున్నది అంతా ఒక డ్రామా. పార్లమెంట్‌ ఉభయసభల్లో అమోదించిన అంశాలపై ఇష్టారీతిన ఎలా మాట్లాడతారు?’’ అని కేంద్రమంత్రి షెకావత్‌ ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని