Published : 17 Dec 2021 01:39 IST

Vijay Diwas: దేశం కోసం 32 తూటాలకు బలైన ఇందిరను విస్మరిస్తారా?: కాంగ్రెస్‌

కేంద్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శ

దిల్లీ: పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించి నేటికి 50ఏళ్లు గడిచిన సందర్భంగా దేశవ్యాప్తంగా విజయ్‌ దివస్‌ను ఘనంగా జరుపుకొంటున్నారు. అయితే ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పేరును ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించకపోవడంపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. నాటి యుద్ధ సమయంలో దేశానికి నాయకత్వం వహించిన మాజీ ప్రధానిని స్మరించుకోకుండా కేంద్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది.

దేశానికి తొలి, ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీని విజయ్‌ దివాస్‌ వేడుకలకు ఈ స్త్రీద్వేష ప్రభుత్వం దూరం చేసిందని కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. ‘మీ గంభీర ప్రకటనలను మహిళలెవరూ నమ్మరని.. దేశభక్తిపై మీ వైఖరి కూడా ఆమోదయోగ్యం కాద’ని ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేశారు. 1971లో జరిగిన యుద్ధానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఇందిర పేరును కనీసం ప్రస్తావించకపోవడం శోచనీయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ విమర్శించారు. దేశం కోసం 32 తూటాలకు బలైన ఇందిరను విస్మరిస్తారా? అని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బంగ్లాదేశ్‌ విముక్తిలో ఇందిరా గాంధీ పాత్రను ప్రభుత్వం గుర్తించకపోవడం దురదృష్టకరమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కనీసం ప్రధాని మోదీ కానీ, ప్రభుత్వం కానీ ఇందిరా గాంధీ పేరును ప్రస్తావించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఉక్కుమనిషిగా పేరొంది, దేశాన్ని ముందుండి నడిపించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరును కూడా చెప్పకుండా భాజపా చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా విమర్శించారు. ఇది వారి సంకుచిత మనస్తత్వానికి ఉదాహరణ అని దుయ్యబట్టారు. పాకిస్థాన్‌తో యుద్ధం సమయంలో దేశానికి నాయకత్వం వహించిన ఇందిరా గాంధీ పేరును అభద్రతా భావంతోనే ప్రధాని మోదీ ప్రస్తావించడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గౌరవ్‌ గొగొయి విమర్శించారు. ఈ పరిణామం దురదృష్టకరమన్న ఆయన.. చరిత్రను తుడిచివేసే ప్రయత్నంలోనే భాగమేని ఆరోపించారు.

1971లో తూర్పు పాకిస్థాన్‌లో మొదలైన స్వాతంత్య్ర పోరు భారత్‌-పాక్ మధ్య యుద్ధానికి దారి తీసింది. అందులో పాక్‌ను భారత సైన్యం ఓడించడంతో బంగ్లాదేశ్‌ అవతరణకు మార్గం సుగమమయ్యింది. ఆ విజయానికి గుర్తుగా భారత్‌ ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్‌ను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా యుద్ధంలో అమరులైన జవాన్లకు ప్రధాని మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు నివాళులు అర్పించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని