
TS News: భాజపావి అసత్యాలు.. కిషన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి: హరీశ్‌రావు
హైదరాబాద్: భాజపా నేతలు సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ..కేసీఆర్ కిట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.5వేలు ఇస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్నారు. నిరూపించాలని ఛాలెంజ్ చేస్తే ఒక్క భాజపా నాయకుడు కూడా ముందుకు రాలేదన్నారు. సిలిండర్లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వేస్తుందని భాజపా దుష్ప్రచారం చేస్తుందని.. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ విధించడం లేదని స్పష్టం చేశారు.
‘‘బీబీనగర్ ఎయిమ్స్‌కు స్థలం ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్విటర్‌లో పోస్టు చేశారు. ఏడాదిన్నర క్రితమే బీబీనగర్‌లో 201 ఎకరాల 24 గుంటల స్థలం, భవనం ఎయిమ్స్ డైరెక్టర్‌కు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అప్పగించింది. కేంద్ర మంత్రిగా ఉండి కిషన్‌రెడ్డి ట్విటర్‌లో అసత్యాలు పోస్టు చేయడం తగదు. అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు కిషన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి. కిషన్‌రెడ్డి సరైన వాళ్లను తన సలహా బృందంలో నియమించుకోవాలి. కేంద్రంలోని భాజపా రాష్ట్ర ప్రజలను చిన్నచూపు చూస్తోంది. కేంద్రం దేశ వ్యాప్తంగా 157 వైద్య కళాశాలలు ఇచ్చింది. కానీ, తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కళాశాల కూడా మంజూరు చేయలేదు. కిషన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వైద్య కళాశాలలు తీసుకురావాలి. బీబీ నగర్ ఎయిమ్స్ మంజూరు చేశామని భాజపా నేతలు చెప్పుకుంటున్నారు. ఎయిమ్స్ మెడికల్ కళాశాల రాష్ట్ర విభజన చట్టంలో హక్కుగా వచ్చింది. గిరిజన వర్సిటీని రాష్ట్రానికి ఇప్పించాలని కిషన్‌రెడ్డిని కోరుతున్నా. ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. బీసీల జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. కానీ, కేంద్రం నుంచి స్పందన లేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం కిషన్‌రెడ్డి బయ్యారం ఉక్కు పరిశ్రమ తీసుకురావాలి’’ అని హరీశ్‌రావు అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.