Ts News: న్యాయమైన వాటా కావాలి.. గొంతెమ్మ కోరికలు కోరడం లేదు: హరీశ్‌రావు

ఏడేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేటలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కృష్ణా జల

Updated : 24 Sep 2022 17:10 IST

సిద్దిపేట: ఏడేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేటలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కృష్ణా జల వివాద పరిష్కారం కోసం కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై నిన్న కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి హరీశ్‌రావు వివరణ ఇచ్చారు.

‘‘నదీ జలాల్లో రాజ్యాంగబద్ధమైన, న్యాయమైన వాటానే కోరతున్నాం. చట్టవిరుద్ధమైన గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. నాలుగు నెలల కిందనే నా వద్దకు వచ్చింది.. నాలుగు నెలల నుంచే ఈ అంశం పెండింగ్‌లో ఉంది.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు.. అని కేంద్ర మంత్రి షెకావత్‌ నిన్న మీడియాతో అన్నారు. ఇది నాలుగు నెలల నుంచి కాదు.. ఏడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్య. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదంపై రాష్ట్రం ఏర్పడిన 42వ రోజే సెక్షన్‌ 3 కింద కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు చేసిన ఏడాదిలోగా సమస్య పరిష్కరించాలని చట్టంలో ఉంది. సమస్య పరిష్కారం కాకపోతే ట్రైబ్యునల్‌కు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. 12 నెలలపాటు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఆగస్టు 2015లో సుప్రీం కోర్టుకు వెళ్లాం. సుప్రీంకోర్టులో కేసు ఉన్నా నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి కాదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు.. నిర్ణయం తీసుకొనేలా ఆదేశాలివ్వండనే సుప్రీంకోర్టుకు వెళ్లాం. మరో ఉద్దేశంతో సర్వోన్నత న్యాయస్థానానికి పోలేదు. సరైన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకొని ఉంటే సుప్రీంను ఆశ్రయించాల్సిన అవసరం రాష్ట్రానికి ఎందుకు వస్తుంది? రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా మొదటి ప్రాధాన్యత నీళ్లకు ఇచ్చాం. ఇప్పటికైనా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. చట్టం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ ట్రైబ్యునల్‌కు అనుసంధానం చేయండి.. లేదా కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయండి’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని