UP Polls: ఇతర పార్టీలతో కాంగ్రెస్‌ చేయి కలుపుతుందా?

అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకునే అంశంపై తమ పార్టీ ‘ఓపెన్‌ మైండెడ్‌’ గానే ఉందని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు.

Published : 19 Jul 2021 01:04 IST

ప్రియాంక గాంధీ ఏమన్నారంటే..?

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకునే అంశంపై తమ పార్టీ ‘ఓపెన్‌ మైండెడ్‌’ గానే ఉందని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. అంతేకాకుండా కూటమిగా ఏర్పడటాన్ని తోసిపుచ్చలేనని స్పష్టం చేశారు. యూపీ ఎన్నికల్లో 403 సీట్లలో కాంగ్రెస్‌ ఒంటరిగా బరిలోకి దిగుతుందా? లేక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా అన్న ప్రశ్నకు ప్రియాంక గాంధీ ఈ విధంగా జవాబిచ్చారు.

‘వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోవడం.. కూటమిగా ఏర్పడటాన్ని నేను తోసిపుచ్చను. అయితే, దీనిపై ఇప్పుడే ప్రకటన చేయడం తొందరపాటే అవుతుంది. కచ్చితంగా మేము పట్టుదలకు పోము. విశాల దృక్పథంతో  ఉంటాం’ అని కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. భాజపాను ఓడించడమే తమ లక్ష్యం అన్న ప్రియాంక గాంధీ.. ఈ విషయంలో ఇతర రాజకీయ పార్టీలు కూడా ఓపెన్‌ మైండెడ్‌గా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇక తనను రాజకీయ టూరిస్టుగా అభివర్ణిస్తోన్న భాజపాపై ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. కేవలం నాతోపాటు నా సోదరుడు రాహుల్‌ గాంధీని ప్రభావం లేని రాజకీయ నాయకులుగా చిత్రీకరించేందుకే భాజపా ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

భాజపా తప్పుదోవపట్టిస్తోంది: మాయావతి

బీఎస్‌పీ అధినేత్రి మాయావతి కూడా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. భాజపాకు దగ్గరగా ఉన్నట్లు భావించే బ్రాహ్మణ వర్గానికి దగ్గరయ్యేందుకు ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందుకోసం జులై 23న ‘బ్రాహ్మణ్‌ సమ్మేళన్‌’ పేరుతో అయోధ్యలో మాయావతి ఓ కార్యక్రమాన్ని తలపెట్టారు. రాష్ట్రంలో బ్రాహ్మణ వర్గానికి దగ్గరయ్యేందుకు భాజపా ప్రభుత్వం వారిని తప్పుదోవ పట్టిస్తోందని బీఎస్‌పీ అధినేత మాయావతి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బ్రాహ్మణులు భాజపాకు ఓటు వేయరన్న మాయావతి.. 2007 మాదిరిగా ఈసారి తమ పార్టీకి మద్దతు ఇస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని