చంద్రబాబు అలా అనడం పద్ధతి కాదు.. నిజాలు తెలియజేసేందుకే కొప్పర్రుకు వచ్చాను: సుచరిత

పోలీసులను ఉపయోగించుకొని భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అనడం సరైంది కాదని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు...

Updated : 23 Sep 2021 15:05 IST

పెదనందిపాడు: పోలీసులను ఉపయోగించుకొని భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అనడం సరైంది కాదని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రును హోంమంత్రి సందర్శించారు. తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణలో గాయపడిన వైకాపా కార్యకర్తలను సుచరిత పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. ‘‘తెదేపా కార్యకర్తలు ప్రణాళిక ప్రకారం వంద మందిని కూర్చోబెట్టి ఘర్షణ వాతావరణం సృష్టించారు. ముందుగానే రాళ్లు ఏర్పాటు చేసుకొని దాడికి పాల్పడ్డారు. నిజాలు తెలియజేయడానికే కొప్పర్రు గ్రామాన్ని సందర్శించాను. ఘర్షణలో తెదేపా శ్రేణులు గాయపడ్డారని అంటున్నారు. మీడియాలో ఒక్కరిని కూడా ఎందుకు చూపించలేదు? మీడియా నిజాలు చూపించాలి. భయానక వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అత్యంత దారుణం.

2009 నుంచి ఎమ్మె్ల్యేగా ఉన్నాను. కొప్పర్రులో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉంటుంది. అప్పటి జడ్పీటీసీ సభ్యులు కొత్త సంస్కృతి తీసుకొచ్చారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. ముందస్తు ప్రణాళికతోనే వంద మందిని ఇంట్లో కూర్చోబెట్టారు. వైకాపా కార్యకర్త శ్రీకాంత్‌ను ఇంట్లోకి తీసుకెళ్ళి తీవ్రంగా కొట్టారు. ఓ వైకాపా కార్యకర్తకు కన్ను కోల్పోయే పరిస్థితి వచ్చింది. నేను హోంశాఖ మంత్రి అయి రెండున్నరేళ్లు అవుతుంది. నా నియోజకవర్గంలోని ఏ గ్రామంలో ఇలాంటి పరిస్థితులు లేవు. కారం చల్లింది.. రాళ్ళు రువ్వింది... ఎవరనేది వీడియో దృశ్యాల్లో స్పష్టంగా తెలుస్తోంది. వైకాపాకు చెందిన పది మంది కార్యకర్తలకు గాయాలయ్యాయి’’ అని సుచరిత అన్నారు. ఈ సందర్భంగా కొప్పర్రులో వైకాపా సభ.. సభలో దాడి దృశ్యాలను సుచరిత మీడియా ముందు ప్రదర్శించారు. 


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts