Ap News: ఎంపీలకు బాధ్యత గుర్తు చేసేందుకే డిజిటల్‌ క్యాంపెయిన్‌: పవన్‌ కల్యాణ్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జనసేన అదినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఈ నెల 18, 19, 20 తేదీల్లో

Updated : 17 Dec 2021 17:00 IST

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జనసేన అదినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఈ నెల 18, 19, 20 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వైకాపాకు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి కూడా ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా గళం విప్పలేకపోయారని.. పైగా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారికి వారి బాధ్యతను గుర్తు చేయాలన్న లక్ష్యంతో డిజిటల్ క్యాంపెయిన్ సాగిద్దామన్నారు. వైకాపా, తెదేపా ఎంపీలు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. డిజిటల్‌ క్యాంపెయిన్‌లో భాగంగా విశాఖ స్టీల్ ఆంధ్రుల హక్క అనే నినాదాన్ని పార్లమెంట్‌లో గట్టిగా వినిపించాలని కోరుతూ లోకసభ, రాజ్యసభ సభ్యలను సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు 18వ తేదీ ఉదయం 10గంటలకు సామాజిక మాధ్యమాల ద్వారా ఎంపీలను ట్యాగ్ చేసే డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

‘‘విశాఖ స్టీల్‌ పరిరక్షణపై మన ఎంపీలకు వారి బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం ఉందని జనసేన భావించింది. పార్లమెంట్‌లో ప్లకార్డులు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన బాధ్యతను స్వీకరించి వైకాపా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వంతో కలసి ముందుకెళ్లేందుకు మేము సంసిద్ధతతో ఉన్నాం. రాష్ట్ర సమస్యలు, కష్టాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లకపోతే తప్పు చేసిన వాళ్లమవుతాం. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు, కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తాం. స్టీల్ ప్లాంట్ కోసం చేసిన త్యాగాలు, బలిదానాలు మేం మర్చిపోలేదు. తెలంగాణ జిల్లాలకు చెందిన వారూ విశాఖ ఉక్కు సాధనకు ప్రాణ త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అదే బాధ్యతను గుర్తు చేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని కోరుతున్నాం. మీరు మీ వంతు బాధ్యత నిర్వర్తించాలి. పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారంలో పునరాలోచన చేయాలనే విషయాన్ని కేంద్రానికి తెలియజెప్పాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని