Narayan Rane Arrest: ప్రతీకార చర్యే.. భయపడేది లేదు..!

మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేంద్ర మంత్రి నారాయణ రాణేను అరెస్టు చేయడం రాజ్యాంగ విలువలను ఉల్లంఘించడమేనని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.

Updated : 25 Aug 2021 05:56 IST

భాజపా అధ్యక్షుడు నడ్డా, మాజీ సీఎం ఫడణవీస్

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేంద్ర మంత్రి నారాయణ రాణేను అరెస్టు చేయడం రాజ్యాంగ విలువలను ఉల్లంఘించడమేనని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. అలాంటి చర్యల వల్ల మమ్మల్ని అణచివేయలేరని.. అందుకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జన ఆశీర్వాద యాత్ర ద్వారా భాజపాకు వస్తోన్న మద్దతు చూసి కొందరు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అంతేకాకుండా తమపై జరిగే దాడులపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతూనే ఉంటామని.. యాత్ర కూడా కొనసాగుతుందని జేపీ నడ్డా స్పష్టం చేశారు.

ప్రతీకార చర్యే.. ఫడణవీస్‌

కేంద్ర మంత్రి నారాయణ రాణే చేసిన వ్యాఖ్యలను భాజపా సమర్థించట్లేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పేర్కొన్నారు. కానీ, ఒకవేళ అరెస్టు చేస్తే ఆయనకు పార్టీ మద్దతు 100శాతం ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు. రాజకీయ ప్రతీకారం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖను వినియోగించుకుంటోందని దేవేంద్ర ఫడణవీస్‌ ఆరోపించారు. కేవలం శాంతిభద్రతలు కల్పించాలి తప్పితే తాలిబన్‌ వంటి ప్రభుత్వం కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ అణచివేత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్‌ స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదని, అలాంటి వ్యక్తి చెంప పగలగొట్టాలని రాయ్‌గఢ్‌ జిల్లాలో జరిగిన జనఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి నారాయణ రాణే వ్యాఖ్యానించారు. ఇవి తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఇందుకుగానూ కేంద్ర మంత్రిపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. దీంతో రత్నగిరి పర్యటనలో ఉన్న రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు నుంచి తక్షణమే రక్షణ కావాలంటూ కేంద్ర మంత్రి బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ ఆయనకు చుక్కెదురైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని