
TS News: కేసీఆర్ కంటే అబద్దమే ముందు పుట్టింది: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: దళితబంధుపై తెరాస అసత్య ప్రచారాలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దమ్ముంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే రాష్ట్రంలోని ఎస్సీలందరికీ దళితబంధు అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఏదైనా కాంగ్రెస్‌తో భాజపా పొత్తు పెట్టుకోదన్న ఆయన తెరాసనే ఆపని చేస్తోందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని బూజునూరులో భాజపా అభ్యర్థి ఈటలతో కలిసి కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ఎన్నికలు వస్తే కేసీఆర్ కుటుంబానికి పూనకం వచ్చినట్టు అబద్దాలు మాట్లాడతారు. అబద్దం ముందు పుట్టి కేసీఆర్ కుటుంబం తరువాత పుట్టినట్టుంది. అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దళితబంధుపై అసత్య ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ గుండెమీద చెయ్యి వేసుకుని చెప్పాలి. 30వ తేదీతో ఎన్నికలు ముగుస్తాయి. ఆ మరుసటి రోజే తెలంగాణలోని ప్రతి ఒక్క దళితుడికి రూ.10లక్షలు ఇస్తారా?. కేసీఆర్ మాటమీద నిలబడే వ్యక్తి కాదు’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.