Updated : 15/08/2021 17:13 IST

ts politics: తెలంగాణలో భాజపా దూకుడు.. యాత్రకు సిద్ధమైన కిషన్‌రెడ్డి, బండి

హైదరాబాద్‌: తెలంగాణలో బలోపేతం కావడమే లక్ష్యంగా భాజపా వ్యూహాలతో ముందుకు సాగుతోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు నేతల పర్యటనకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెరాస సర్కారు విధానాలను ఎండగడుతూ 2023లో జరిగే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెస్తామని భాజపా ముఖ్యనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో అధికారం చేపట్టాలని భావిస్తున్న భాజపా అందుకు అనుగుణంగా జోరు పెంచింది. యాత్రలతో ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచించింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి హోదాలో ఈనెల 19న కిషన్‌రెడ్డి రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. అదే రోజు జన ఆశీర్వాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న కిషన్‌రెడ్డి... కేంద్ర ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 19న దిల్లీ నుంచి నేరుగా తిరుమల  శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని అక్కడి నుంచి కోదాడ రానున్నారు. అదే రోజు కోదాడలో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుంది. ఈనెల 20న దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్దన్నపేట మీదుగా వరంగల్‌ చేరుకుంటారు. వరంగల్‌లో ఉచిత టీకా కేంద్రాన్ని కిషన్‌రెడ్డి సందర్శిస్తారు. అదే రోజు జనగామ జిల్లా రఘునాథపల్లె మండలం ఖిల్లాషాపూర్‌కు వెళ్లి  సర్వాయి పాపన్న కోటను పరిశీలిస్తారు. ఆలేరుకు చేరుకుని పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేత కళాకారుడు చింతకింది మల్లేశంతో సమావేశమవుతారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. 21న భువనగిరిలో రేషన్‌ దుకాణాలకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని పరిశీలిస్తారు. ఘట్కేసర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం మీదుగా  నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి యాత్ర చేరుకుంటుంది. అక్కడ ముగింపు సభ నిర్వహించనున్నారు. 12 జిల్లాలు, 7 పార్లమెంట్‌, 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 324 కిలోమీటర్ల మేర కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర సాగనుంది.

ఈ నెల 24 నుంచి ప్రజా సంగ్రామయాత్ర
భాజపా రాష్ట్ర సారధి బండి సంజయ్‌ ఈనెల 24న చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్ర కోసం 29 కమిటీలను నియమించారు. ఈనెల 24న చార్మినార్‌  నుంచి నాంపల్లి, మెహదీపట్నం మీదుగా షేక్‌పేట వరకు యాత్ర సాగనుంది. ఈనెల 25న గోల్కొండ వద్ద సభ తర్వాత రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో పాదయాత్ర కొనసాగనుంది. ఆ లోగా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ వస్తే ఆమేరకు యాత్ర రూట్‌ మ్యాప్‌ మార్చనున్నారు. సెప్టెంబరు 17న హుజూరాబాద్‌లో భారీ బహిరంగ సభతో తొలి విడత పాదయాత్ర ముగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరుకావాలని రాష్ట్ర నాయకత్వం కోరింది. తెరాస సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్ర స్థాయిలో ఎండగట్టి, రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకొస్తామని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని