
KTR Vs Revanth: ట్వీట్ వార్.. రేవంత్ వర్సెస్ కేటీఆర్!
ఇంటర్నెట్‌డెస్క్: తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఒకరు ట్వీట్ చేస్తే దానికి ప్రతిగా మరొకరు కౌంటర్ ఇస్తున్నారు. ఆ ఇద్దరి ట్వీట్ల వార్తో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసలెందుకీ ట్వీట్ వార్?ఆ ఇద్దరి మధ్య ఏం జరిగింది?
రేవంత్ ‘వైట్ ఛాలెంజ్’తో..
రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తాను ‘వైట్ ఛాలెంజ్’ ప్రారంభిస్తున్నానని ఇటీవల రేవంత్ ప్రకటించారు. దీనికోసం తాను కూడా సిద్ధమని.. డ్రగ్స్ పరీక్షల కోసం తన రక్తం, వెంట్రుకల నమూనాలను ఇస్తానని చెప్పారు. అక్కడితో ఆగకుండా మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నానని తెలిపారు. వాళ్లిద్దరూ ఛాలెంజ్‌ను స్వీకరించి మరో ఇద్దరికి ఛాలెంజ్ చేయాలని రేవంత్ కోరారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్కు వద్దకు చేరుకుంటానని.. ఏ ఆస్పత్రికి రమ్మంటే అక్కడికి వస్తానన్నారు. డ్రగ్స్ పరీక్షల కోసం వైద్యులకు నమూనాలు ఇద్దామని చెప్పారు. డ్రగ్స్ కేసుపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని.. ఓ మంత్రిగా ఎందుకు జోక్యం చేసుకోకూడదని రేవంత్ ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ సిద్ధమా?: కేటీఆర్ కౌంటర్
డ్రగ్స్ పరీక్షలపై రేవంత్‌రెడ్డి విసిరిన ‘వైట్ ఛాలెంజ్’పై కేటీఆర్ స్పందించారు. తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమేనని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘రాహుల్ ఒప్పుకొంటే దిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలకు సిద్ధం. నాది చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారి స్థాయి కాదు. పరీక్షల్లో క్లీన్చిట్ వస్తే రేవంత్ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా? ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా?’’ అని రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు.
లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమే.. కానీ కేసీఆర్‌తో: రేవంత్
పరీక్షలకు రాహుల్ గాంధీ సిద్ధమా? ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్‌పై రేవంత్ స్పందించారు. ఆయన కూడా ట్విటర్ ద్వారానే కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌తో కలిసి లైడిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని.. దీనికి సమయం, స్థలం చెప్పాలన్నారు. ‘‘కేసీఆర్ అవినీతి ఆరోపణలపై లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం. సీబీఐ కేసులు, సహారా పీఎఫ్ అక్రమాలు, ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్మాణంలో అక్రమాలపై లైడిటెక్టర్ పరీక్షలకు కేసీఆర్ సిద్ధమా?’’ అని రేవంత్ సవాల్ విసిరారు.
కావాలనే దుష్ప్రచారం.. పరువు నష్టం దావా వేశా: కేటీఆర్
మరోవైపు రేవంత్ ట్విటర్లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ మళ్లీ స్పందించారు తనపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని.. కోర్టులో పరువునష్టం దావా వేసినట్లు తెలిపారు. దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. వారిపై న్యాయస్థానం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.