
KTR: ఈటల, రేవంత్ భేటీ వెనుక మతలబేంటి?: కేటీఆర్
హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ సమీపిస్తోన్న నేపథ్యంలో తెరాస, భాజపాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఈటలపై మంత్రి కేటీఆర్ తాజాగా పలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలతో ఆయన కుమ్మక్కయ్యారని విమర్శించారు. హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్లో ఈటల, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కలుసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. వారి భేటీ వెనక మతలబేంటని ప్రశ్నించారు. ఈటల, రేవంత్ కలిశారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వారిరువురూ కలిసినట్లు ఉన్న ఆధారాలు బయటపెడతాం అని అన్నారు. ఎన్నికల సంఘం పరిధి దాటి వ్యవహరిస్తోందని తెలిపారు. హుజూరాబాద్‌లో తెరాసను నిలువరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్, భాజపా ఉమ్మడి అభ్యర్థిగా ఈటల కొనసాగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని విమర్శించారు.
ప్లీనరీ ఏర్పాట్లు పరిశీలన..
తెరాస ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా నగరంలోని హైటెక్స్‌లో ఈ నెల 25న నిర్వహించనున్న తెరాస ప్లీనరీ ఏర్పాట్లను ఆ పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్లీనరీ ఉదయం 10 గంటలకే ప్రారంభమవుతుందన్నారు. ప్లీనరికి వచ్చే ప్రతినిధులకు అన్ని ఏర్పాటు చేశామన్న కేటీఆర్.. అనుమతి ఉన్నవారే సమావేశానికి హాజరవుతారని స్పష్టం చేశారు. ఈ సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తి అవుతాయని తెలిపారు.
‘‘రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెరాస ఆవిర్భవించింది. జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగాం. పాలనను కొత్త మలుపులు తిప్పి దేశానికి దిక్సూచిగా నిలిచాం. పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు, అధ్యక్ష పదవికి ఎన్నికకు ప్లీనరీ నిర్వహిస్తున్నాం. సమావేశానికి 6వేలకు పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రతినిధుల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేశాం. సభా ప్రాంగణానికి ఇరువైపులా 50 ఎకరాల్లో పార్కింగ్ ఉంటుంది. గులాబీ చొక్కాలు, చీరలు ధరించి రావాలని సూచించాం. మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేశాం. ప్లీనరీలో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక ఉంటుంది. ఏడు అంశాలపై తీర్మానాలు ఉంటాయి’’ అని కేటీఆర్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.