KTR: ధర్నాల కోసం కలెక్టర్ల అనుమతి తీసుకోండి: కేటీఆర్‌

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 12న ధర్నాకు తెరాస పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ఆ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Updated : 09 Aug 2022 14:01 IST

హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 12న ధర్నాకు తెరాస పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ఆ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ధర్నాల కోసం కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. కలెక్టర్ల అనుమతితోనే ధర్నాలు నిర్వహించాలని కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు వివరించారు. మరోవైపు రైతులకు సంఘీభావంగా తెరాస ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ధర్నా చౌక్‌ను మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ పరిశీలించారు. వారి వెంట ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, వెంకటేశ్వర్లు, దానం నాగేందర్‌ ఉన్నారు.

ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. ‘‘ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా ధర్నా చేస్తున్నాం. సాగు చట్టాలతో రైతులను కేంద్ర ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోంది. రాష్ట్ర భాజపా నేతలు వరి పండించాలని చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెబుతోంది. భాజపా నాయకులది రెండు నాయకుల ధోరణి’’ అని తలసాని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని