TS News: తెలంగాణ భాజపా నేతలకు ఇదే నేర్పిస్తున్నారా?: కేటీఆర్‌

కుటుంబ సభ్యులపై నీచంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సంస్కారమా? అని భాజపా నేతలను మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. తీన్మార్‌ మల్లన్న ట్విటర్‌ వేదికగా చేసిన పోస్టుపై

Published : 25 Dec 2021 01:25 IST

హైదరాబాద్‌: కుటుంబ సభ్యులపై నీచంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సంస్కారమా? అని భాజపా నేతలను మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. తీన్మార్‌ మల్లన్న ట్విటర్‌ వేదికగా చేసిన పోస్టుపై స్పందించిన ఆయన .. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్వీట్‌ చేశారు. తెలంగాణ భాజపా నేతలకు ఇదే నేర్పిస్తున్నారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. తన కుమారుడు, అతని శరీరాన్ని ఉద్దేశించి నీచంగా  రాజకీయ వ్యాఖ్యలు చేయడం సంస్కారమా అని నిలదీశారు. భాజపా నేతల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా కుటుంబ సభ్యులనుద్దేశించి తామూ ఇదే తరహాలో స్పందిస్తామని ఎందుకు అనుకోరని కేటీఆర్‌ ప్రశ్నించారు. దిగజారుడు వ్యాఖ్యలు చేయకుండా అలాంటి నేతలను నిలువరించాలని కోరిన ఆయన... న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు.

భాజపా నేతల తరహాలోనే వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దని, ఆ పరిస్థితి వస్తే తమను తప్పుపట్టవద్దని కేటీఆర్‌ అన్నారు. దురదృష్టం కొద్దీ భావ ప్రకటనా స్వేచ్ఛ విమర్శించేందుకు, బురదజల్లేందుకు హక్కుగా మారిందన్నారు. సామాజిక మాధ్యమాలను జర్నలిజం ముసుగులో విషప్రచారం చేసేందుకు ఓ అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసాంఘిక ప్రవర్తనకు సామాజిక మాధ్యమాలు స్వర్గధామం అయ్యాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. జర్నలిజం ముసుగులో యూట్యూబ్‌ ఛానెళ్ల ద్వారా నిత్యం అర్థంలేని విషయాలను ప్రసారం చేస్తున్నారని, చిన్న పిల్లలను కూడా ఇందులోకి లాగుతున్నారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని