
KTR: ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పే దమ్ముందా?: భాజపాకు కేటీఆర్ సూటి ప్రశ్న
హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న నిరుద్యోగ దీక్షపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. సంజయ్‌ది నిరుద్యోగ దీక్ష కాదని.. అవకాశవాద దీక్ష అని విమర్శించారు. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనలో తెరాస చిత్తశుద్ధిపై కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల్లో భాజపా వైఫల్యాలను ఎండగట్టారు. దేశ నిరుద్యోగ యువతకు భాజపా ఏం చేసిందో చెప్పాలన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న భాజపా హామీ ఏమైందని.. ఎన్ని కొలువులిచ్చారో చెప్పే దమ్ముందా అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. కేంద్రం వల్ల రాష్ట్రానికి దక్కిన ఉద్యోగాలెన్నో చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది భాజపా కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. యువతను నమ్మించి నట్టేట ముంచిన చరిత్ర భాజపాదేనని ఆరోపించారు. దేశంలో గత 40ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని.. కేంద్రం ఇచ్చిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కల్పనలో తెరాస నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు భాజపాకు లేదని వ్యాఖ్యానించారు.
బండి సంజయ్‌కు నిరుద్యోగుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేయాలని కేటీఆర్ అన్నారు. టీఎస్ ఐపాస్ విధానం ద్వారా రూ.2లక్షల 20వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి సుమారు 16లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పించామని మంత్రి లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌కు ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, మెడికల్ డివైజెస్ పార్కు వంటి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చినా కేంద్రం నుంచి అదనంగా ఒక్క రూపాయీ సాయం అందలేదన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.