TS News: కేంద్రం ఆ ప్రతిపాదన విరమించుకోకపోతే ఉద్యమం తప్పదు: కేటీఆర్‌

జనవరి ఒకటో తేదీ నుంచి వస్త్ర పరిశ్రమపై విధించబోతున్న అదనపు జీఎస్టీ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్‌

Updated : 30 Dec 2021 20:15 IST

హైదరాబాద్‌: జనవరి ఒకటో తేదీ నుంచి వస్త్ర పరిశ్రమపై విధించబోతున్న అదనపు జీఎస్టీ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.  ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని, జీఎస్టీ కౌన్సిల్‌లో ఈ పన్ను పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ లేఖ రాశారు. వస్త్రాలపై జీఎస్టీ పన్ను పెంపు వల్ల దేశంలోని వస్త్ర, చేనేత పరిశ్రమ పూర్తి స్థాయిలో కుదేలవుతుందని  కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

దేశంలో వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన కోట్లాది మంది కార్మికులకు ఈ నిర్ణయం సమ్మెట పోటని, ఇది వారి జీవితాలను పూర్తిగా దెబ్బతీస్తుందన్నారు. జీఎస్టీ పన్ను పెంపు విషయంలో వస్త్ర పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను, జరుగుతున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. లేకుంటే టెక్స్‌టైల్‌, అప్పారెల్‌ యూనిట్లు నష్టాలపాలై మూతపడే ప్రమాదముందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. ఈవిషయంలో ఒక వేళ కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే.. వ్యవసాయ చట్టాల విషయంలో రైతన్నలు తిరగబడిన మాదిరే దేశంలోని నేతన్నలు సైతం తిరగబడతారని హెచ్చరించారు. పన్ను పెంపు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకునే వరకు ఈ విషయంలో వస్త్ర పరిశ్రమ పారిశ్రామిక వర్గాలకు, దేశంలోని నేతన్నలకు తెలంగాణ తరఫున అండగా ఉంటామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని