Ap News: కర్నూలు జడ్పీ ఛైర్మన్‌ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి రాజీనామా

కర్నూలు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను జిల్లా కలెక్టరు కోటేశ్వరరావుకు...

Updated : 18 Dec 2021 17:18 IST

కర్నూలు: కర్నూలు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను జిల్లా కలెక్టరు కోటేశ్వరరావుకు అందించారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన రాజీనామా చేయడంతో ఆ పదవి ఎర్రబోతుల పాపిరెడ్డికి వచ్చే అవకాశం ఉంది. ఎర్రబోతుల వెంకటరెడ్డికి ఛైర్మన్‌ పదవి ఇస్తానని గతంలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. కరోనా కారణంగా వెంకటరెడ్డి మృతిచెందారు. దీంతో ఆయన కుమారుడు పాపిరెడ్డి ఉప ఎన్నికలో గెలిచారు. పాపిరెడ్డి కోసం మల్కిరెడ్డిని పార్టీ అధిష్ఠానం రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది.

జడ్పీ ఛైర్మన్‌గా వెంకట సుబ్బారెడ్డి ఈ ఏడాది సెప్టెంబరు 25న బాధ్యతలు చేపట్టారు. గత నెలలో జడ్పీ స్థాయీ సంఘ ఎన్నికలు నిర్వహించారు. ఈ నెలలో సర్వసభ్య సమావేశానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కొత్త సమస్య మొదలైంది. జడ్పీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయాలని వైకాపాకు చెందిన కొందరు నేతలు ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడిన తర్వాత రాజీనామా చేస్తానని సుబ్బారెడ్డి ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. సీఎం ఆదేశిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకుంటే కొనసాగుతానని వెంకట సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని